Begin typing your search above and press return to search.

అర్థం లేని మాటలు కట్టిపెట్టు: పాక్‌ మాజీ క్రికెటర్‌ పై భజ్జీ ఆగ్రహం!

2021 డిసెంబర్‌ 24న అన్నిరకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి భజ్జీ తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రాజ్యసభ సభ్యుడిగా హర్భజన్‌ సేవలందిస్తున్నాడు

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:08 AM GMT
అర్థం లేని మాటలు కట్టిపెట్టు: పాక్‌ మాజీ క్రికెటర్‌ పై భజ్జీ ఆగ్రహం!
X

భారత ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ గురించి తెలియనివారు లేరు. లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే తర్వాత మరో స్పిన్నర్‌ ఎవరు అని భారత్‌ క్రికెట్‌ ఎదురుచూసిన క్షణంలో తారాజువ్వలా హర్భజన్‌ దూసుకొచ్చాడు. 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి అనిల్‌ కుంబ్లే, రవిచంద్ర అశ్విన్, కపిల్‌ దేవ్‌ ల తర్వాత స్థానంలో నిలిచాడు. అలాగే వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.

2021 డిసెంబర్‌ 24న అన్నిరకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి భజ్జీ తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రాజ్యసభ సభ్యుడిగా హర్భజన్‌ సేవలందిస్తున్నాడు. అలాగే క్రికెట్‌ కామెంటేటర్‌ గానూ కొనసాగుతున్నాడు.

తాజాగా హర్భజన్‌ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పై మండిపడ్డాడు. సోషల్‌ మీడియా ఫ్లాట్‌పాం ఎక్స్‌ లో ఇంజ మామ్‌ పోస్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే హర్భజన్‌.. ఇంజమామ్‌ పై మండిపడ్డాడు. అర్థం లేని మాటలు కట్టిపెట్టాలని వార్నింగ్‌ ఇచ్చాడు.

అసలు మొత్తం గొడవలోకి వెళ్తే... పాకిస్థానీ ఇస్లామిక్‌ టెలివిజన్‌ బోధకుడు మౌలానా తారిఖ్‌ జమీల్‌ గురించి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ మాట్లాడుతున్న ఒక వీడియో తాజాగా వైరల్‌ అయ్యింది. అందులో తాము అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే రోజుల్లో మౌలానా తమతో నమాజు చేయించేవాడని చెప్పాడు.

ఈ క్రమంలో ఇండియాతో జరిగిన ఓ సిరీస్‌ సమయంలో మౌలానా బోధనలకు భారత క్రికెటర్లు కూడా వచ్చారని ఇంజమామ్‌ తెలిపాడు. ఈ మేరకు తానే జహీర్‌ ఖాన్, ఇర్ఫాన్‌ ఫఠాన్, మహ్మద్‌ కైఫ్‌ లను ఆహ్వానించానని వెల్లడించాడు. హర్భజన్‌ సైతం తమతో నమాజుకు వచ్చేవాడని ఇంజమామ్‌ వెల్లడించాడు. ఈ క్రమంలో మౌలానా బోధనల పట్ల హర్భజన్‌ ప్రభావితమయ్యాడని ఇంజమామ్‌ తెలిపాడు. మతం మారాలనే కోరికను కూడా తన వద్ద హర్భజన్‌ వ్యక్తపర్చాడని ఇంజమామ్‌ బాంబుపేల్చాడు. ఇంజమామ్‌ మాట్లాడిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ నేపథ్యంలో ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పై హర్భజన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అర్ధం లేని మాటలు మాట్లాడొద్దంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ఇంజమామ్‌ వ్యాఖ్యలపై హర్భజన్‌ ఎక్స్‌ లో స్పందించాడు. అలాంటి అర్థంలేని మాటలు మాట్లాడే ముందు ఇంజమామ్‌ ఏమి తాగాడని నిలదీశాడు. తాను భారతీయుడిగా, సిక్కుగా గర్విస్తానని పేర్కొన్నాడు. కాగా ఇంజమామ్‌ వీడియో పట్ల పలువురు నెటిజన్లు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు.