Begin typing your search above and press return to search.

సైన్యం లేని దేశం.. పోలీసు తుపాకీ పట్టని ప్రాంతం.. అయినా ఎంతో సురక్షితం!

2025లో ప్రయాణికులకు ప్రపంచలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఐస్లాండ్ ను పేర్కొంది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 5:30 PM GMT
సైన్యం లేని దేశం.. పోలీసు తుపాకీ పట్టని ప్రాంతం.. అయినా ఎంతో సురక్షితం!
X

చాలామంది నుంచి.. ఈ రోజుల్లో ప్రపంచంలో డబ్బుంటే అన్నీ దొరుకుతున్నాయి కానీ ప్రశాంతత, సురక్షితమైన ప్రాంతం మాత్రం అత్యంత అరుదైపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఎక్కడ చూసిన, ఏ కొత్త ప్రాంతానికి వెళ్దామన్నా లోలోపల ఏదో తెలియని అభద్రతాభావం అని చాలా మంది అంటుంటారు. మహిళలైతే మరీ ఇన్ సెక్యూరిటీ ఫీలవుతుంటారని చెబుతుంటారు.

అయితే.. 2025లో ప్రయాణికులకు ప్రపంచలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా తెరపైకి వచ్చింది. ఇందులో రెండో స్థానం, మూడో స్థానం కోసం పలు దేశాలు పోటీ పడ్డాయి కానీ.. ఫస్ట్ స్థానం మాత్రం ప్రత్యేకంగా ఓ దేశానికి ఫిక్స్ అని.. ఆ దేశానికి ఈ విషయంలో అన్ని అర్హతలు ఉన్నాయని చెబుతూ.. ఊహకందని స్థాయిలో ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు. అదే.. ఐస్లాండ్!

అవును... అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్ షైర్ హాత్వే ట్రవెల్ ప్రొటక్షన్ ఇటీవల ప్రపంచంలోని సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐస్లాండ్ దేశం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ప్రయాణికులకు ప్రపంచలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఐస్లాండ్ ను పేర్కొంది. దీంతో.. ఐస్లాండ్ ప్రత్యేకతలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ జాబితాను సిద్ధం చేయడానికి కంపెనీ ప్రయాణికులను సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. నేరాల రేటు, మహిళల భద్రత, ఎల్.జీ.బీ.టీ.ఐ.క్యూ+ ప్రయాణికుల అనుభవం, రవాణా, పర్యాటకుల ఆరోగ్య సంరక్షణ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. ఈ సంస్థ 2016 నుంచి ఈ సర్వే నిర్వహిస్తోందని వెల్లడించారు.

ఈ క్రమంలో గత ఏడాది జాబితాలో ఐస్లాండ్ తొమ్మిదో స్థానంలో నిలవగా.. 2024లో ప్రయాణికుల అనుభవాలు దాన్ని టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి. కేవలం 4 లక్షల మంది మాత్రమే ఉన్న ఈ ద్వీప దేశంలో హింసాత్మక నేరాల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని.. అందువల్ల పోలీసులు తుపాకులు కలిగి ఉండరని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఐస్లాండ్ కు సైన్యం కూడా లేదు!

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఇక్కడ పోలీసు చర్యలు పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ నేరాల రేటు కూడా తక్కువ కాగా.. ప్రధానంగా పర్యాటకుల రవాణా భద్రతకు అధిక ప్రాముఖ్యత ఇస్తారని చెబుతారు. దీంతో. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది కెనడా. ఈ దేశం స్త్రీలు, ఎల్.జీ.బీ.టీ.ఐ.క్యూ+ ప్రయాణికులకు సురక్షితంగా ఉందని, తక్కువ నేరాల రేట్లు ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఇక్కడ నయాగరా జలపాతం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ అని అంటున్నారు. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఐర్లాండ్ నిలిచింది. ఇక్కడ కూడా నేరాల రేటు తక్కువని చెబుతున్నారు!

ఆ తర్వాత స్విట్జర్లాండ్ ఐదోస్థానంలో నిలవగా.. తర్వాత స్థానాల్లో వరుసగా... న్యూజిలాండ్, జర్మనీ, నార్వే, జపాన్, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, యూకే, నెధర్లాండ్స్, స్వీడన్ నిలిచాయని సర్వే సంస్థ వెల్లడించింది.