Begin typing your search above and press return to search.

'ఇరాన్' లో హమాస్ చీఫ్ హతం.. వేళ్లన్నీ ఇజ్రాయెల్ వైపే.. యుద్ధంలో కుదుపు

అతి భయంకరమైన హమాస్ ఉగ్ర సంస్థ అధిపతి ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు

By:  Tupaki Desk   |   31 July 2024 5:55 AM GMT
ఇరాన్ లో హమాస్ చీఫ్ హతం.. వేళ్లన్నీ ఇజ్రాయెల్ వైపే.. యుద్ధంలో కుదుపు
X

8 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఎన్నో పరిణామాలు.. వేలాదిమంది పౌరుల బలి.. వందలాది క్షిపణి దాడులు.. లెబనాన్ వరకు విస్తరించిన దాడులు.. ఇలా పలు ఉదంతాలు.. అలాంటి యుద్ధంలో తాజాగా అత్యంత కీలక సంఘటన జరిగింది. అతి భయంకరమైన హమాస్ ఉగ్ర సంస్థ అధిపతి ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. ఇతడి వయసు 62. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియానే ప్రకటించడంతో ఎలాంటి సందిగ్ధతకూ తావు లేకపోయింది. అంతేకాక.. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ సమాచారం ఆధారంగా ఈ ప్రకటన చేసింది. అంతేకాక.. ఇజ్రాయెల్ దాడిలోనే హనియా చనిపోయాడని హమాస్ చెబుతోంది.

టెహ్రాన్ లో దాడి.. ఇక ఏం జరుగుతుందో?

రెండు నెలల కిందట ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ లోని ఇరాన్ గార్డ్స్ హతమయ్యారు. దీంతోనే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తప్పదని అనుకున్నారు. ఇరాన్ దీటుగానే స్పందించినా.. అది అక్కడితో ఆగిపోయింది. కానీ, ఇప్పుడు హమాస్ చీఫ్ ను ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోనే హతమార్చారు. అంటే.. ఇది తీవ్ర పరిణామమే. అంతేకాక.. 8 నెలలుగా సాగుతున్న యుద్ధం ఇపుడు ఎక్కడికో వెళ్లనుంది.

అధ్యక్షుడి ప్రమాణానికి వెళ్లి వస్తుండగా..

ఇరాన్ లో ఇటీవల ఎన్నికలు జరిగి అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరై తిరిగొచ్చిన హనియాను ఆయన ఇంటి వద్దనే దాడి చేసి హతమార్చారని ఇరాన్ మీడియా వివరిందింది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టింది. కాగా, హనియా కరుడుగట్టిన హమాస్ ఉగ్రవాది. అతడు పుట్టిందే గాజా సిటీకి దగ్గరలోని ఓ శరణార్థి శిబిరంలో కావడం గమనార్హం. 1980ల చివర్లో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్‌ లో చేరాడు. 1990లో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్‌ ను స్థాపించిన అహ్మద్‌ యాసిన్‌ కు రాజకీయ సలహాలిస్తూ అత్యంత సన్నిహితుడయ్యారు. హమాస్ లో అంచలంచెలుగా ఎదిగాడు. 2004లో ఇజ్రాయెల్‌ దాడుల్లో అహ్మద్‌ యాసిన్‌ చనిపోయాక హమాస్‌ లో హనియాదే హవా.

పాలస్తీనా ఒకప్పటి ప్రధాని

హనిమా సామాన్యుడు కాదు.. 2006లో పాలస్తీనా ప్రధానిగా ఎన్నికయ్యాడు. అంటే.. గాజా సహ పాలస్తీనా మొత్తానికి ప్రధాని అన్నమాట. కానీ.. 2007లో హనియాను పాలస్తీనా నేషనల్‌ అథారిటీ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ తొలగించారు. కానీ, దీనిని హనియా లెక్కచేయలేదు. గాజాను ప్రధానిగా కొనసాగుతున్నాడు. 2017లో హమాస్ అధిపతి అయ్యాడు. అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

యుద్ధంలో కుటుంబాన్నే కోల్పోయి..

ఏప్రిల్‌ లో ఇజ్రాయెల్‌ దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాళ్లు చనిపోయారు. యావత్ కుటుంబాన్నే అతడు కోల్పోయాడు. కాగా, హనియా 2019 నుంచి ఖతర్‌ లో ఉంటున్నాడు.

ఇప్పుడు ఇరాన్ లో.. పైగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరై వచ్చిన తర్వాత హనియాను హతమార్చడం అంటే యుద్ధం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. తమ గడ్డపై అతిథిని ఇజ్రాయెల్ కాల్చి చంపడాన్ని ఇరాన్ తేలిగ్గా తీసుకుంటుందని భావించలేం. అసలే లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్జొల్లా మీద దాడికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ లెక్కన చూస్తే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అనేక దేశాలకు విస్తరించనుందా? అనే అనుమానం కలుగుతోంది.