పోచారం సరే కడియమా ? దానమా ?
గత మూడు రోజులుగా ఢిల్లీలో సీఎం రేవంత్ ఈ విషయంలో అధిష్టానంతో చర్చలు జరుపుతున్నాడు.
By: Tupaki Desk | 27 Jun 2024 12:30 PM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి చేరిక వ్యవహారం హాట్ హాట్ గా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరికి మంత్రి పదవులు గ్యారంటీ అన్న సంకేతాలు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చర్చకు తెరతీస్తున్నాయి. గత మూడు రోజులుగా ఢిల్లీలో సీఎం రేవంత్ ఈ విషయంలో అధిష్టానంతో చర్చలు జరుపుతున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. దానం ఎంపీగా పోటీచేసి ఓడిపోగా, కడియం తన కూతురు కావ్యను వరంగల్ నుండి గెలిపించుకున్నాడు.
ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరి భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయించాడు. ఇక తాజాగా పార్టీ మారిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ల చేరికలు బీఆర్ఎస్ ను విస్మయ పరిచాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అని అంటున్నారు. ఇందులో పోచారం శ్రీనివాస్ రెడ్డికి దాదాపు ఖాయం అంటుండగా, మరో పదవి కడియం శ్రీహరికి దక్కుతుందా ? దానం నాగేందర్ కు దక్కుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పోరేషన్ పదవి ఖాయం అని చెబుతున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.