"పిల్లల ఏడుపే ఎర"... ఇజ్రాయెల్ పై హ్యూమన్ రైట్స్ సంచలన ఆరోపణ!
గత ఏడాది హమాస్ ఉగ్రవాదులు చేసిన ఓ పని వల్ల ప్రాప్తించిన ఫలితాన్ని గాజా ప్రజలు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Dec 2024 4:30 PM GMTగత ఏడాది హమాస్ ఉగ్రవాదులు చేసిన ఓ పని వల్ల ప్రాప్తించిన ఫలితాన్ని గాజా ప్రజలు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ ఉగ్రవాదులు చేసిన ఊచకోత ఫలితంగా... గాజా వణికిపోతూనే ఉంది. ఇప్పటికే కాంక్రీట్ పౌండర్ తో గాజా మొత్తం నిండిపోయిందని అంటున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఇజ్రాయెల్ సైన్యం దాడులకు గాజా చిగురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. బంధీలను అప్పగించేస్తే దాడులు ఆపేస్తామని చెబుతున్నప్పటికీ.. గాజా ప్రజల కంటే తమకు తమ పట్టింపులే ఎక్కువన్నట్లుగా హమాస్ ముందుకుపోతుందని అంటున్నారు. ఈ సమయంలో... యూరో-మిడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ మహా హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా... గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న డ్రోన్ల నుంచి చిన్నపిల్లల ఏడుపు శబ్ధాలు వినిపిస్తున్నాయని.. పాలస్తీనీయులను బయటకు రప్పించి, దాడులు చేయడం కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు ఆరోపించారు. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ఈ స్థాయిలో ఇజ్రాయెల్ ప్లాన్ చేసి పాలస్తీనీయులను చంపుతుందని అన్నారు.
ఈ సందర్భంగా... ఇజ్రాయెల్ కు చెందిన డ్రోన్ల నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నాని తమకు ఏప్రిల్ లోనే సమాచారం అందిందని.. వాటిలో నుంచి చిన్న పిల్లల ఏడుపు, మహిళల ఆర్థనాదాల శబ్ధాలు వంటివి వినిపిస్తున్నాయని కొంతమంది చెప్పారని.. దీంతో తాను నుసెరాయిత్ లో పర్యటించి సాక్ష్యాధారాలతో తెలుసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రధానంగా శిబిరాల వద్ద ఈ తరహా శబ్ధాలు వినిపిస్తున్నారని.. దీంతో లోపల ఉన్నవారు బయటకు రాగానే వారిపై దాడులకు పాల్పడుతున్నారని హుస్సేనీ ఆరోపించారు. ఈ ఆరుపులు, ఏడుపులు విని బయటకు వచ్చిన చాలా మంది గాయపడినట్లు ఆమె తెలిపారు. "నాకు అమ్మ కావాలి" అని చిన్నారుల ఏడుపు శబ్ధాలతో డ్రోన్లు ప్రయోగిస్తున్నారని అన్నారు.
కాగా... బంధీలను విడిచిపెట్టే వరకూ దాడులు ఆపేది లేదని చెబుతోన్న ఇజ్రాయెల్... ఈ ఏడాది జనవరిలో గాజాలో ఆహారం కోసం ఎగబడిన వందలాదిమంది పౌరులపైనా ఈ డ్రోన్లతోనే దాడులు చేసినట్లు అప్పట్లో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... హిబ్రూ, అరబిక్ బాషల్లో చిన్నపిల్లల వాయిస్ తో శబ్ధాలు చేస్తూ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు.