Begin typing your search above and press return to search.

ఏడాది యుద్ధం.. అర లక్ష ప్రాణాలు.. అంతులేని విధ్వంసం

ఓవైపు రెండున్నరేళ్లుగా జరుగుతోంది ఓ యుద్ధం.. మరో యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది.. మొదటిది రెండు దేశాల మధ్య పోరాటం

By:  Tupaki Desk   |   6 Oct 2024 11:30 AM GMT
ఏడాది యుద్ధం.. అర లక్ష ప్రాణాలు.. అంతులేని విధ్వంసం
X

ఓవైపు రెండున్నరేళ్లుగా జరుగుతోంది ఓ యుద్ధం.. మరో యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది.. మొదటిది రెండు దేశాల మధ్య పోరాటం.. రెండోది కేవలం ఓ ఉగ్ర సంస్థ.. ఓ చిన్న దేశం మధ్యన అస్తిత్వ సమరం.. వెనక్కు తిరిగి చూస్తే.. అర లక్ష ప్రాణాలు.. అంతులేని విధ్వంసం.. చివరకు ఓ ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం.. ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి.. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో చెప్పలేని దుస్థితి..

2023 అక్టోబరు 7..

ఇజ్రాయెల్.. ఓ చిన్న దేశం.. మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ ఉమ్మడి జిల్లా అంతటి వైశాల్యం. కానీ.. చుట్టూ శత్రువులే. ఓ యూదు దేశంగా ముస్లిం దేశాలతో దశాబ్దాలుగా పోరాటమే.. అయితే, కొన్నేళ్లుగా కాస్త ప్రశాంతంగా ఉన్న సమయంలో నిరుడు అక్టోబరు 7న గాజా హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పటినుంచి మొదలైన యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది. దీనికి ఏడాదిన్నర ముందే మొదలైంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఇంకా కొనసాగుతోంది. ఇందులోనే కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ ఏడాది యుద్ధంలో

బందీలలో బతికున్నది ఎందరో?

చరిత్రలో ఎన్నడూ లేనంత దాడి ఇది. దాదాపు 1200 మందిని చంపేసి 250 మందికిపైగా ఇజ్రాయెలీలను బందీగా పట్టుకెళ్లారు. వీరిలో ఇంకా 100 మంది ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. ఎంతమంది బతికి ఉన్నారన్నది తెలియరాలేదు. 70 మందే జీవించి ఉన్నారని అంటున్నారు. కాగా, గత ఏడాది అక్టోబరు 8 నుంచి ఇజ్రాయెల్.. చేస్తున్న దాడుల్లో గాజాలో 41 వేల మంది చనిపోయారు. ఇళ్లు నేలమట్టం కావడంతో లక్షలమంది ఒకచోట నుంచి ఒకచోటకు మారుతూ నిరాశ్రయులయ్యారు. వీరంతా శరణార్థి శిబిరాల్లోనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసిందని భావించినా.. గాజా కోలుకోవడం కష్టమే అంటున్నారు.

అసహనంలో ఇజ్రాయెల్‌ ప్రజలు.. హమాస్ కు చావుదెబ్బ

ఏడాది నుంచి యుద్ధం జరుగుతుండడంతో ఇజ్రాయెల్ ప్రజలు తీవ్ర అసహనం, నైరాశ్యంలో ఉన్నారు. బందీలను విడిపించుకోలేకపోవడం, మరోవైపు హెజ్‌బొల్లాతో యుద్ధం మొదలవడం వారిని ఇబ్బందికి గురి చేస్తోంది. ఇక హెజ్‌బొల్లా, హూతీల నుంచి క్షిపణి దాడులతో చికాకు పడుతున్నారు. పైకి 61 శాతం మంది ఇజ్రాయెలీలు యుద్ధానికి మద్దతిస్తున్నా.. పర్యవసానాల పట్ల ఆందోళన చెందుతున్నారు.

ప్రాంతీయ యుద్ధంగా..

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో హెజ్బొల్లా, హూతీలు వీటికి మద్దతిచ్చే ఇరాన్ కూడా ప్రవేశించడంతో ఓ ప్రాంతీయ యుద్ధంగా మారింది. ఏడాది నుంచి హమాస్‌ కు ఇరాన్‌ మద్దతిస్తూనే ఉంది. నేరుగా యుద్ధంలోకి మాత్రం దిగలేదు. అయితే, తమ దేశంలోనే హమాస్ రాజకీయ విభాగం అధిపతి హనియెను హతమార్చడం, హెజ్‌బొల్లా అధినేత నస్రల్లానూ చంపడంతో ఇరాన్ యుద్ధం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్‌ పైకి గత వారం క్షిపణులను ప్రయోగించింది. ఇది పూర్తి యుద్ధంగా మారుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇక గాజాతో పాటు లెబనాన్‌ సరిహద్దు, ఎర్ర సముద్రం యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ఇరాన్ దాడితో కూడా కలిపి చూస్తే యుద్ధం యెమెన్, ఇరాన్‌ ల దాకా పాకింది. ఇజ్రాయెల్‌ కు అమెరికా, బ్రిటన్ మద్దతు పలకగా.. ఇరాన్ కు చైనా, రష్యా అండగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ కు అమెరికా, ఇరాన్‌ కు రష్యా ఆయుధాలను సమకూరుస్తామని హామీ ఇచ్చాయి.