Begin typing your search above and press return to search.

ఇరాన్ ను ఏడాది కోలుకోలేనంత దెబ్బకొట్టిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ మీదకు ఈ నెల 1న 200 వరకు క్షిపణులను ప్రయోగించింది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 9:45 AM GMT
ఇరాన్ ను ఏడాది కోలుకోలేనంత దెబ్బకొట్టిన ఇజ్రాయెల్
X

గత ఏడాది అక్టోబరు 7న హమాస్ భయంకర దాడితో మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పడు బహుముఖంగా మారింది. ఓవైపు హమాస్ మరోవైపు హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ లు, ఇంకోవైపు వీటికి ఇరాన్ మద్దతు ఇచ్చే ఇరాన్ తో ఇజ్రాయెల్ సమరం సాగిస్తోంది. యెమెన్ లోని హూతీలూ తరచూ దాడులకు దిగుతున్నారు. ఇక ఏప్రిల్ నెలలో లెబనాన్ లో ఉన్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ) పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. పలువురిని హతమార్చింది. జూలైలో ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన హమాస్ పొలిటికల్ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియేను చంపేసింది. దీంతో ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అయింది. ఇజ్రాయెల్ మీదకు ఈ నెల 1న 200 వరకు క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతీకారం ఉంటుందని ఇజ్రాయెల్ చెప్పినా.. 25 రోజులు ఆగింది.

అనేక భయాందోళనల మధ్య

ఇరాన్ అణు శక్తి ఉన్న దేశం. దాని అణుస్థావరాలపై దాడి చేస్తే పెను విధ్వంసమే. దీంతో అమెరికా సహా పలు దేశాలు రంగంలోకి దిగి ఇజ్రాయెల్ ను సముదాయించాయి. ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోబోమని ఇజ్రాయెల్ చేత చెప్పించాయి. అయితే, 25 రోజుల తర్వాత శనివారం ఇజ్రాయెల్ తమ ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించింది. ఈ నెల 1న తమపై దాడికి కొన్ని వారాల క్రితం ఇరాన్‌ ఏ క్షిపణులను వాడిందో.. వాటి తయారీ కేంద్రాలనే దెబ్బతీసింది.

ఏడాది నుంచి రెండేళ్లయినా..

ఆయుధ సాయంతో మిలిటెంట్ గ్రూప్ లు హమాస్, హిజ్బుల్లాలకు వెన్నుదన్నుగా నిలిచే ఇరాన్ వెన్ను విరిచింది ఇజ్రాయెల్. క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేయడం ద్వారా ఈ పని చేసింది. ఈ క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు కోలుకోవాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుందని సమాచారం. క్షిపణుల్లో వాడే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే 12 పైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయి. ఈ పరికరాలను ఇరాన్‌ చైనా లేదా మరేదైనా దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. సొంతంగా తయారు చేయలేదు. ఇక టెహ్రాన్‌ లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థనూ ఇజ్రాయెల్ దారుణంగా దెబ్బతీసింది. పర్చిన్‌ మిలిటరీ కాంప్లెక్స్‌ లో డ్రోన్ల తయారీ యూనిట్‌ నూ ఇజ్రాయెల్ జెట్లు ధ్వంసం చేశాయి.

ఆ రెండు క్షిపణుల ఇంధనం..

ఖెబర్‌, హజ్‌ ఖాసీం అనేవి ఇరాన్ బాలిస్టిక్‌ క్షిపణులు. కాగా, అక్టోబరు 1, అంతకుముందు ఈ రెండు క్షిపణులనే ఇజ్రాయెల్‌ మీద దాడికి ఇరాన్ వాడింది. ఈ రెండు క్షిపణుల్లో వాడే ఘన ఇంధనాన్ని తయారు చేసే కర్మాగారం ఇజ్రాయెల్ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. ఇది ఇరాన్ మిసైల్‌ ప్రోగ్రామ్‌ కు వెన్నెముక. దీనిలోని 20 హెవీ ఫ్యూయల్‌ మిక్సర్లు ధ్వంసమయ్యాయని.. ఒక్కో దాని ఖరీదు 2 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ మిక్సర్లను తిరిగి అమర్చాలంటే ఏడాది, పాత స్థితికి చేరాలంటే రెండేళ్లు పట్టొచ్చట. కాగా, పర్చిన్‌, మరోచోట బాలిస్టిక్‌ మిసైల్‌ కాంప్లెక్సులు దెబ్బతిన్నాయి. పర్చిన్‌ సైనిక సముదాయంలో మూడు భవనాలు దెబ్బతిన్నాయట. ఈ ఘన ఇంధనం మిక్సర్‌ తయారీ, ఎగుమతి పై ఆంక్షలు ఉండడం గమనార్హం. వీటిని ఇరాన్‌ భారీగా డబ్బు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బతో.. ఇరాన్ క్షిపణి తయారీ సామర్థ్యం కుప్పకూలిందని నిపుణులు పేర్కొంటున్నారు.