లోయలో పుట్టిన ఉగ్ర సంస్థతో భీకర యుద్ధం.. ఎక్కడకు పోతుందో?
పొరుగు దేశం లెబనాన్ కేంద్రం పనిచేస్తున్న హిజ్బుల్లాతో 2006లో 34 రోజులు యుద్ధం సాగించింది ఇజ్రాయెల్.
By: Tupaki Desk | 24 Sep 2024 6:42 AM GMTప్రపంచంలో భయంకరమైన ఉగ్రవాద సంస్థల్లో హిజ్బుల్లా. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ) తోడ్పాటుతో ఓ లోయలో పుట్టిందీ ఉగ్ర సంస్థ. ఆ లోయ పేరు బెకా. పుట్టింది 1982లో.. అంటే 42 ఏళ్ల కిందట. ఇజ్రాయెల్ ను కట్టడి చేసేందుకు హిజ్బుల్లాకు పురుడు పోసింది ఇరాన్. మొన్నటివవరకు గాజా కేంద్రంగా పాలన సాగించే హమాస్ తో అత్యంత భీకర యుద్ధం సాగించింది ఇజ్రాయెల్. ఇప్పుడు హిజ్బుల్లా వంతు వచ్చింది. గత మంగళవారం పేజర్లు.. బుధవారం వాకీ టాకీలు.. శుక్రవారం కీలక కమాండర్ల హతం.. ఇలా ఊపరిసలపకుండా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. సోమవారం (23వ తేదీ) ఏకంగా పూర్తిస్థాయి యుద్ధాన్నే చూపించింది. హెజ్‌బొల్లా ఆయుధాలను దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని ప్రకటించింది.
18 ఏళ్ల అనంతరం అంతటి తీవ్రంగా
పొరుగు దేశం లెబనాన్ కేంద్రం పనిచేస్తున్న హిజ్బుల్లాతో 2006లో 34 రోజులు యుద్ధం సాగించింది ఇజ్రాయెల్. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో దాడి కి దిగింది. హిజ్బుల్లా అడ్డా అయిన దక్షిణ లెబనాన్ ను టార్గెట్ గా చేసుకుంది. అయితే, దీనికి ప్రతిగా రెండు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 125 రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా చెప్పింది.
భారీగా ప్రాణ నష్టం
గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇక తాము హిజ్బుల్లాపై ఫోకస్ పెడతామని చెప్పారు. ఆదివారం హిజ్బుల్లాకు మళ్లీ అర్థమయ్యేలా చెబుతాం అని ప్రకటించారు. దీనికితగ్గట్లే సోమవారం పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధానికి శ్రీకారం చుట్టారు. గాజాలోని హమాస్ పై నుంచి తమ పోరాటాన్ని హిజ్బుల్లా మీదకు మళ్లించారు. అయితే, ఆదివారం హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడికి దిగింది. దీనికి సమాధానంగా సోమవారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్ దద్దరిల్లేలా దాడులు చేసింది. సైదా, మరజుయాన్, టైర్, జహరానితో పాటు బెకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. అక్టోబరు 7న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ మొదలయ్యాక ఎన్నడూ లేనంతగా 356 మంది మృతి చెందారు. 1,246 మంది గాయపడ్డారు. బెకా లోయలోని పౌరులు హిజ్బుల్లా ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించింది. పౌరులు దీనిని తీవ్రంగా తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సోమవారం హిజ్బుల్లాకు చెందిన 1,300 లక్ష్యాలను ధ్వంసం చేశామని.. క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా చేపట్టిన ఈ దాడులు ఆగబోవని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
వెళ్లిపోమంటూ 80 వేల కాల్స్..
సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ దక్షిణ లెబనాన్ లోని ప్రాంతాలకు ఇజ్రాయెల్ కొన్ని గంటల్లోనే 80 వేల కాల్స్ చేసింది. ఆపై దాడులకు దిగింది. దీంతో ఆ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలు చిగురుటాకులా వణికాయి. వేలాదిమంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాజధాని బీరుట్ వైపు వెళ్లిపోయారు. ఒక్కసారిగా వాహనాలు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, బీరుట్ పైనా ఇజ్రాయెల్ దాడి చేసింది. సదరన్ కమాండ్ కమాండర్ అలీ కరాకీని టార్గెట్ చేసింది. పరిస్థితి తీవ్రతను గమనించి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. మిడిల్ ఈస్ట్ (మనకు పశ్చిమాసియా)కు అదనపు బలగాలను పంపాలని నిర్ణయించారు.
ప్రాంతీయ యుద్ధం.. లెబనాన్ మరో గాజా
అటు హమాస్, ఇటు హిజ్బుల్లాలతో ఇజ్రాయెల్ సాగిస్తున్న పోరాటం ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది. అందుకే అదనపు బలగాలను పంపుతోంది. అయితే.. లెబనాన్ మరో గాజా కానుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యక్తంచేశారు. ఉద్రిక్తతలు చల్లారకుంటే యుద్ధం పశ్చిమాసియాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.