హమాస్ చీఫ్ నూ లేపేసిన ఇజ్రాయెల్? యానివర్సరీ రిటర్న్ గిఫ్ట్
సరిగ్గా గత ఏడాది అక్టోబరు 7న జరిగింది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి.
By: Tupaki Desk | 23 Sep 2024 8:15 AM GMTసరిగ్గా గత ఏడాది అక్టోబరు 7న జరిగింది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి. భయంకరమైన నాటి దాడితో ప్రపంచమే దిగ్ర్భాంతి చెందింది. అత్యంత అలర్ట్ గా ఉండే ఇజ్రాయెల్ కూడా ఇంతటి దాడికి గురవుతుందా? అని ఆశ్చర్యపోయారు. ఇది జరిగి ఏడాది అవుతున్నప్పటికీ నాటి ఘటనలను తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇంతటి భీకర దాడికి పాల్పడిన హమాస్ పై ఏడాది నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. హమాస్ ను దాదాపు కుదేలు చేసినా.. హెజ్బొల్లా, ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.
మొన్న హనియా..
హమాస్ భయంకర ఉగ్ర సంస్థ. అలాంటి సంస్థకు నంబర్ 2 ఇస్మాయిల్ హనియా. గత నెలలో అతడిని ఇరాన్ లో హతమార్చింది ఇజ్రాయెల్. బయటకు తెలియకపోయినా.. ఈ హత్య జరిగిన తీరుతో ఈ పని ఇజ్రాయెల్ దేనని స్పష్టమైంది. హనియాను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ నిఘా విభాగం మొస్సాద్ ఇద్దరు ఇరాన్ ఏజెంట్లనూ నియమించుకున్నట్లు తేలింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరైన హనియాను అతడు భవనంలోనే బాంబులు అమర్చి చంపేసింది అనే ఊహాగానాలు వచ్చాయి. వాస్తవానికి హనియా బస చేసింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ) గెస్ట్ హౌస్ లో కావడం గమనార్హం.
ఇప్పుడు ఇతడి వంతు..
హమాస్ నంబర్ 2 తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం హమాస్ అధినేత యాహ్యా సిన్వార్. తాజాగా సిన్వార్ మృతి చెందినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఎప్పటిగానే ఇజ్రాయెల్ దీనిపై నోరు మెదపడం లేదు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడికి రూపకర్త యాహ్యానే అని ఇజ్రాయెల్ గట్టి నమ్మకం. అయితే, చాలా రోజుల నుంచి అతడి నుంచి ఎలాంటి ప్రకటనలూ లేవు. దీంతోనే యాహ్యా బతికి లేడని చెబుతుతోంది. దీనిని బలపరిచే ఆధారాలు లేకున్నా.. ఇజ్రాయెల్ అనుమానిస్తుందంటేనే నమ్మాలి.
ఇజ్రాయెల్ మీడియా ఏమంటోంది...?
ఇజ్రాయెల్ మీడియా మాత్రం సిన్వర్ చనిపోయాడనే చెబుతున్నాయి. ఈ మేరకు కథనాలు ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ స్పందన కూడా అనుమానాస్పదంగానే ఉంది. సిన్వర్ చనిపోయాడని లీక్ లు ఇస్తూనే.. బలపరిచే ఆధారాలు దొరకలేదని అంటోంది. కాగా, హమాస్ ను ఇంతకాలం పోరాడేలా చేసింది అవి తవ్వుకున్న సొరంగాలే. అంతూ దరి లేని ఈ సొరంగాలు ఇజ్రాయెల్ కూ ఓ పట్టాన కొరుకుడు పడలేదు. అయితే, వాటిని ఇజ్రాయెల్ ఇటీవల తీవ్రంగా దెబ్బతీసింది. ఇందులోనే సిన్వర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సిన్వర్ ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడు గాయపడ్డాడా? లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అనేది అర్థం కావడం లేదు. కాగా, ఇజ్రాయెల్.. హెజ్బొల్లాను టార్గెట్ చేసుకుంటూనే హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు సాగిస్తుందనే కథనాలు వస్తున్నాయి. హమాస్ ను లొంగదీసుకోవడానికి సిన్వర్ చనిపోయాడనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నదనే అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబరులోనే సిన్వర్ మృతి చెందినట్లు వార్తలొచ్చాయి.
అనుచరులకూ దొరకకుండా..
సిన్వర్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తుంటాడు. ఇప్పుడు కూడా అతడు దాక్కోవడంలో భాగంగానే అనుచరులకు దూరంగా ఉన్నట్లు తేలింది. మరోవైపు ఇజ్రాయెల్ వాయుసేన సెంట్రల్ గాజాలో జరిపిన వైమానిక దాడిలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దెబ్బతిన్నది. దీనిని ఖలీద్ ఇబ్న్ అల్ వాలీద్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంటోంది.