Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ కంట్లో నస్రుల్లా.. ఓ కూరగాయల వ్యాపారి కొడుకు

నిరుడు అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడికి దిగింది గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్.

By:  Tupaki Desk   |   28 Sep 2024 2:30 PM GMT
ఇజ్రాయెల్ కంట్లో నస్రుల్లా.. ఓ కూరగాయల వ్యాపారి కొడుకు
X

నిరుడు అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడికి దిగింది గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్. అప్పటినుంచి భీకర యుద్ధం సాగిస్తోంది ఇజ్రాయెల్. కానీ.. ఇందులోనే హెజ్బొల్లా అనే సంస్థ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ ను తరచూ ఇబ్బంది పెడుతోంది. ప్రత్యక్ష దాడులకూ దిగింది. గాజాపై యుద్ధం ఆపేదాకా ఇజ్రాయెల్‌ ను వదిలేది లేదని ఒకడు ప్రకటన చేశాడు.. అతడే నస్రుల్లా. తాజాగా తమ వైమానిక దాడుల్లో నస్రుల్లా చనిపోయాడని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. నస్రుల్లా కుమార్తె జైనబ్‌ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందింది. గతంలోనే నస్రుల్లా కొడుకు కూడా చనిపోయాడు. ఇంతకూ ఎవరీ నస్రుల్లా? ఇతడి గతం ఏమిటి?

బంకర్ లీడర్

హసన్ నస్రుల్లా.. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు.. కానీ..హెజ్బొలా చీఫ్ అంటే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు హమాస్ ను వదిలి హెజ్బొల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. నస్రల్లాను హతం చేసేందుకు గతంలోనూ ప్రయత్నించినా విఫలమైంది. ఇప్పుడు మాత్రం విజయవంతం అయిందనే కథనాలు వస్తున్నాయి. కాగా, నస్రుల్లాకు ఎప్పుడూ బంకర్లోనే ఉంటాడనే పేరుంది. అందుకనే బంకర్ల నుంచి వచ్చే హెచ్చరికలను తాము పట్టించుకోమని గతంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. తానేమీ బంకర్ లో ఉండనని పదేళ్ల కిందటే చెప్పిన నస్రుల్లా.. దమ్ముంటే దాడి చేసుకోమని సంకేతాలు పంపాడు. కానీ, కచ్చితంగా ఎక్కడ ఉంటాడనేది మాత్రం బయటకు తెలియదు. నస్రుల్లా పెద్ద కుమారుడు హదీ 1997లో ఇజ్రాయెల్‌ చేతిలో చనిపోయాడు.

నూనూగు మీసాలతోనే ఉగ్రవాదంలోకి

లెబనాన్ రాజధాని బీరూట్‌ శివారు బుర్జ్‌ హమ్ముద్‌ లో షియా కుటుంబంలో 1960లో పుట్టాడు నస్రుల్లా. ఇతడి తండ్రి కూరగాయల వ్యాపారి. 9 మంది పిల్లల్లో ఇతడు ఒకడు. మత విద్య చదివి.. 16 ఏళ్ల వయసులోనే షియా రాజకీయ, పదాతి దళం అయిన అమల్‌ ఉద్యమంలో చేరాడు. కాగా, పాలస్తీనా విముక్తి పోరాట సంస్థ (పీఎల్‌వో)ను తుడిచిపెట్టేందుకు 1980లో లెబనాన్‌ ను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్‌. బీరూట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టింది. కానీ.. దీనిపై కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్‌వోలోని కొందరు 1982లో ఇజ్రాయెల్‌ అంతర్గత నిఘా సంస్థ షిన్‌ బెట్‌ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి 91 మందిని చంపేసింది. తామే ఈ పని చేశామని షియా ఇస్లామిస్టులు ప్రకటించారు. కొంత కాలానికి వీరే హెజ్బొల్లాగా ఏర్పడ్డారు. వీరికి మొదటినుంచి ఇరాన్‌ సంపూర్ణ మద్దతు ఉంది. హెజ్బొల్లా ఏర్పాటులో నస్రుల్లాది కీలకపాత్ర.

హెజ్బొల్లా అధినేత హతంతో..

అబ్బాస్‌ అల్‌ ముసావి.. 1992లో హెజ్బొల్లా అధినేత. ఇతడిని ఇజ్రాయెల్‌ దళాలు హతమార్చాయి. నస్రుల్లాను బాగా ప్రోత్సహించాడు ముసావి. అతడి మరణం తర్వాత హెజ్బొల్లా పగ్గాలను నస్రుల్లా చేపట్టాడు. అలా పశ్చిమాసియాలో ఉగ్ర సంస్థను బలోపేతం చేయడమే కాక లెబనాన్‌ ప్రభుత్వంలోనూ చేర్చాడు. హెజ్బొల్లా 2011లో సిరియా అంతర్యుద్ధంలోనూ పాల్గొనడం గమనార్హం. అంటే.. లెబనాన్, ఇజ్రాయెల్ దాడి మరో దేశంలోనూ హెజ్బొల్లా వేలు పెట్టింది. కాగా, 18 ఏళ్ల పాటు దక్షిణ లెబనాన్‌ ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉంది. 2000 సంవత్సరం తర్వాత వెళ్లిపోయింది. ఈ యుద్ధంలో నస్రుల్లా సారథ్యంలో హెజ్బొల్లా గట్టిగా పోరాడింది. దీంతో లెబనాన్ లో దాని పేరు విస్తరించింది. 2006లో లెబనాన్‌ యుద్ధంలో ఇజ్రాయెల్‌ ను ఓడించడంలోనూ నస్రుల్లాదే కీలక ప్రాత. అప్పటినుంచే ఇజ్రాయెల్‌ కు బద్ధ శత్రువుగా మారాడు.