Begin typing your search above and press return to search.

పేజర్లలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు... తెరపైకి షాకింగ్ విషయాలు!

చేతిలో పట్టుకుని, ఫ్యాంట్ పాకెట్ లో పెట్టుకున్న పేజర్లు ఒకేసారి పేలిపోయిన ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా అవాక్కైంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 7:07 AM GMT
పేజర్లలో మిలటరీ గ్రేడ్  పేలుడు పదార్థాలు...  తెరపైకి షాకింగ్  విషయాలు!
X

చేతిలో పట్టుకుని, ఫ్యాంట్ పాకెట్ లో పెట్టుకున్న పేజర్లు ఒకేసారి పేలిపోయిన ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా అవాక్కైంది. లెబనాన్ లోని హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఇలా ఒక్కసారిగా పేలడానికి గల కారణాలు ఏమిటనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... కేవలం పేజర్లలోని బ్యాటరీలు మాత్రమే పేలడం వల్ల ఇంత గాయం కావడం అసాధ్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన ఆపరేషన్ అని, ఈ పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయేల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా సందేహాలు ఉన్నాయని.. సైనిక నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో బ్యాటరీల వల్లే కాదు.. వేలాది పేజర్లలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్... తైవాన్ కు చెందిన ఓ సంస్థ పరికరాలను ఇజ్రాయేల్ ఈ పేలుళ్ల కోసం వాడినట్లు తన కథనంలో పేర్కొంది. ఇది పక్కా ప్లానింగ్ తో చేసిన ఆపరేషన్ అంటున్నారు.

పేజర్లే ఎందుకు..?:

హెజ్ బొల్లాకు షాకివ్వడానికి ఇజ్రాయేల్ సంస్థ ఈ పేజర్లనే వాడుకోవడం వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు! వాస్తవానికి.. ఇజ్రాయేల్ కు దొరక్కుండా ఉండొచ్చనే కారణంతో హెజ్ బొల్లా వ్యూహకర్తలు పేజర్లను వాడాలనే ప్లాన్ తో ఎప్పటినుంచో ఉన్నారు. కీలక సందేశాలను పంపడానికి వీటినే వాడుతొన్నారు.

ఈ క్రమంలో ఇటీవల తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో సంస్థకు చెందిన కొత్త బ్యాచ్ లో సుమారు 3,000 పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది హెజ్ బొల్లా. సరిగ్గా ఈ పేజర్లలోనే సుమారు రెండు ఔన్సుల మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే.. వీటిని తైవాన్ సంస్థతో మాట్లాడుకుని నేరుగా తయారీ ప్రదేశంలోనే అమర్చారా.. లేదా, ట్రాన్స్ పోర్టేషన్ వ్యవస్థలోకి ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వీటిని అమర్చారా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పేజర్లు హెజ్ బొల్లా మిత్ర సంస్థలున్న సిరియా, ఇరాన్ లలోకీ చేరాయని అంటున్నారు.

దీంతో... ఈ మొత్తం ఆపరేషన్ కచ్చితంగా ఇజ్రాయెల్ పనే అని, ఆ దేశానికి చెందిన నిఘా సభ్యులు నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొని ఉంటారని హెజ్ బొల్లా అనుమానిస్తోంది. ఏది ఏమైనా... ఇజ్రాయెల్ తో యుద్ధానికి కాలుదువ్వుతున్న హెజ్ బొల్లాకు ఇది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బే అనేది నిపుణుల మాటగా ఉంది!