Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్‌ తరఫున యుద్ధంలో ఇద్దరు గుజరాతీ అక్కచెల్లెళ్ల సాహసం!

ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న పది లక్షల మందికి పైగా ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు వెళ్లిపోతున్నారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 8:14 AM GMT
ఇజ్రాయెల్‌ తరఫున యుద్ధంలో ఇద్దరు గుజరాతీ అక్కచెల్లెళ్ల సాహసం!
X

తమ దేశంపైకి హమాస్‌ ఉగ్రవాదులు 5 వేలకు పైగా రాకెట్‌ దాడులతో విరుచుకుపడి వందలాది మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవ్వడంతో వారిపై ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులకు దిగిన సంగతి తెలిసిందే. భూతలం, గగనతలం, సముద్ర తలం ఇలా అన్ని వైపులా గాజాను చుట్టుముట్టి భీకర యుద్ధం చేస్తోంది. దీంతో మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు విడుస్తున్న భారీ బాంబుల ధాటికి పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్పకూలుతున్నాయి. దీంతో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. హమాస్‌ దాడుల్లో ఇప్పటివరకు 1400 మంది ఇజ్రాయెల్‌ కు చెందిన పౌరులు, సైనికులు మృతి చెందారు. అలాగే ఇజ్రాయెల్‌ దాడుల్లో 2,670 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 10 వేల మంది పాలస్తీనియన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న పది లక్షల మందికి పైగా ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు వెళ్లిపోతున్నారు. మరోవైపు దక్షిణ గాజాకు వెళ్లిపోతున్న ప్రజలను హమాస్‌ ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. గాజా ప్రజలను అడ్డుపెట్టుకుని, వారిని మానవ కవచాలుగా వాడుకుని తాము తప్పించుకోవాలనే వ్యూహంతో హమాస్‌ ఉగ్రవాదులు ఉన్నారు.

కాగా ఇజ్రాయెల్‌-హమాస్‌ గాజా సరిహద్దుల్లో భీకరంగా సాగుతున్న యుద్ధంలో ఇద్దరు గుజరాతీ యువతుల సాహసం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇజ్రాయెల్‌ లో భారీ ఎత్తున భారతీయులు ఉన్నారు. వీరిలో అత్యధికులు గుజరాతీయులే. వీరు అక్కడ వ్యాపారం, ఉద్యోగాలు తదితర రంగాల్లో ఉన్నారు.

ఇజ్రాయెల్‌ దేశ చట్టాల ప్రకారం.. ఇజ్రాయెల్‌ పౌరులు ఎవరైనా పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం 24 నుండి 32 నెలల పాటు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో భారత్‌ నుంచి వెళ్లిన ఇద్దరు గుజరాతీ అమ్మాయిలు రియా, నిషా సైన్యంలో విధులు చేపట్టారు.

గుజరాత్‌ లోని జునాగఢ్‌ లోని మానవ్దార్‌ తాలూకాలో కొతాడి గ్రామంలో వీరు నివసించేవారు. చాలా సంవత్సరాల క్రితం వీరి కుటుంబం ఇజ్రాయెల్‌ లో స్థిరపడింది. వీరి కుటుంబం ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవిన్‌ లో కిరాణా దుకాణం నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌ - హమాస్‌ పోరులో ఇజ్రాయెల్‌ ఆర్మీలో పనిచేస్తున్న రియా, నిషా హమాస్‌ ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. కాగా నిషా రెండేళ్లుగా లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో హమాస్‌ పై దాడి చేస్తున్న యుద్ధభూమి అయిన గుష్‌ డెన్‌ లో విధులు నిర్వర్తిస్తోంది.

కాగా ఇజ్రాయెల్‌ విద్యావిధానం పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని రియా, నిషాల తండ్రి చెప్తున్నారు. ఇజ్రాయెల్‌ లో తప్పనిసరి సైనిక సేవా విధానంలో భాగంగానే వీరిద్దరూ సైన్యంలో చేరారని అంటున్నారు. తమ పిల్లలు యుద్ధ క్షేత్రంలో పనిచేస్తుండటం పట్ల తమకెలాంటి భయం లేదని అంటున్నారు.