ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో మరణ మృదంగం...పూర్తి వివరాలివే!
ఈ యుద్ధంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా... ఇజ్రాయేలు కు తన మద్దతు తెలిపింది.
By: Tupaki Desk | 10 Oct 2023 4:40 AM GMTహమాస్ మిలిటెంట్లు - ఇజ్రాయేల్ సైన్యానికి మద్య మొదలైన యుద్ధ జ్వాల మరణ మృదంగం మోగించింది. వీదుల్లో గుట్టలుగా పడిఉన్న శవాలు.. రక్తపు టేరులు.. దయాదాక్షిణ్యాలూ లేకుండా సామాన్య ప్రజానికంపై జరుపుతున్న దాడులు వెరసి... ఇరు ప్రాంతాల్లోనూ మృత్యుఘోష వినిపిస్తోంది. ఈ యుద్ధంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా... ఇజ్రాయేలు కు తన మద్దతు తెలిపింది.
అవును... ప్రస్తుతం ఇజ్రాయేల్ – హమాస్ యుద్ధంలో... కాస్త అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఇజ్రాయేల్ కు సంఘీభావం తెలుపుతూ సహకరిస్తున్నాయి! మరోపక్క ఉగ్రవాద ప్రభావిత దేశాలు, నియంతృత్వ పోకడలు కలిగిన రాజ్యాలు మాత్రం హమాస్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు తెలుపుతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలో జరుగుతున్న దారుణాలు, సంఘటనలు ఇప్పుడు చూద్దం!
1600 దాటిన మృతుల సంఖ్య:
ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎన్నో విషాధ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు ప్రాంతాల్లోనూ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం... హమాస్ ఉగ్రవాద దాడులతో ఇజ్రాయేల్ లో సుమారు 900 మందికి పైగా మరణించి ఉంటారని ఆ దేశ ఆర్మీ రేడియో ప్రకటించింది. ఇదే సమయంలో 2,616 మంది గాయపడ్డారని తెలిపింది.
మరోపక్క హమాస్ ఉగ్రవాదుల దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 704 కు చేరుకుందని తెలుస్తుంది. ఇదే సమయంలో గాయపడిన వారి సంఖ్య 3,800 కి చేరిందని తెలుస్తుంది. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకూ మొత్తం 1604 మంది మృతి చెందారని అంటున్నారు!
గాజా అష్టదిగ్బందనం:
హమాస్ పై యుద్ధం ప్రకటించిన అనంతరం ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇక అక్కడ విద్యుత్తు, ఆహారం, నీరు, ఇంధనం అందకుండా ఇజ్రాయేల్ కట్టుదిట్టం చేసింది. తాజాగా ఈ విషయాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ ఘాటుగా స్పందించారు.
ఇందులో భాగంగా... తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, అందువల్ల దానికి తగ్గట్లుగానే తమ పోరాటం, తీసుకునే నిర్ణయాలూ ఉంటాయని స్పష్టం చేశారు. కాగా గాజా మొత్తం తమ కనీస అవసరాలపై ఇజ్రాయెల్ పైనే ఆధారపడుతోంది. దీంతో ఇజ్రాయేల్ తీసుకున్న తాజా నిర్ణయం... గాజాలోని 23లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
130 మంది బందీలు - 1,23,000 మంది నిరాశ్రయులు:
ఇజ్రాయేల్ పై తాము జరుపుతున్న దాడుల్లో సుమారు 130 మందిని బందీలుగా చేసుకున్నట్లు హమాస్ ప్రకటించింది. వీరిలో ఇజ్రాయేల్ ప్రజలతోపాటు, విదేశీయులు, ఇజ్రాయేల్ సైనికులు కూడా ఇన్నట్లు చెబుతున్నారు. ఇజ్రాయేల్ లో బంధీలుగా ఉన్న పాలస్తీనీయులను విడిపించడమే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా హమాస్ ప్రతినిధి ప్రకటించారు.
పైకి వెనకా ముందూ చూడకుండా దాడులకు పాల్పడిన హమాస్ ముష్కరుల చర్య ఫలితంగా ఇజ్రాయేల్ తో పోలిస్తే పాలస్తీనాకే నష్టం ఎక్కువని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే గాజాకు మంచినీరు కూడా ఆపేసిన పరిస్థితుల్లో... ఇప్పటివరకూ 1,23,000 మంది గాజా వాసులు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఒకేగ్రామంలో 100 మంది మృతి:
ఇజ్రాయెల్ లో హమాస్ దారుణ మారణకాండ వల్ల ప్రజల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమయంలో ఇరువైపులా ఇప్పటికే 1600మందికి పైగా మృతి చెందారని తెలుస్తున్న నేపథ్యంలో... వీరిలో ఒకే గ్రామానికి చెందిన వారు 100 మంది ఉన్నారనే వార్త మరింత కలిచి వేస్తుంది.
అవును... కేవలం 1000 మంది నివాసముండే చిన్న వ్యవసాయాధారిత గ్రామమైన బీరిలోని పొలాల్లో 100 మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో... ఇజ్రాయెల్ సహాయక బృందం ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే.. ఈ మరణాలు మొత్తం 900 లోనివేనని అధికారులు ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి ఆందోళన:
మొదలుపెట్టడం అంటే హమాస్ ఉగ్రవాదులు మొదలుపెట్టారు కానీ... ముగింపు మాత్రం తమే ఇస్తామని ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మా ప్రతిదాడి హమాస్ తోపాటు, ఇజ్రాయెల్ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో గాజాకు ఆహారం, విద్యుత్ తోపాటు నీటి సరఫరానూ ఇజ్రాయేల్ ఆపేసింది.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అందోళన వ్యక్తం చేసింది. గాజా భుభాగాన్ని ఇజ్రయేల్ పూర్తిగా ముట్టడించడంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్ పై హమాస్ దాడిని ఖండిస్తున్నామని.. అయితే, గాజాలో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొన్నారు.
అమెరికన్లు సహా భారీగా విదేశీయుల మృతి:
ఇజ్రాయెల్ పై హమాస్ ముష్కరులు జరిపిన దాడిలో ఆ దేశపౌరులతో సహా విదేశీయులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడున్న భారతీయ విద్యార్థులు బంకర్లలో దాక్కుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని చెబ్బుతున్న నేపథ్యంలో... మన పొరుగు దేశాలైన నేపాల్, థాయిలాండ్ కు చెందిన వారు మృతుల్లో ఉన్నారని చెబుతున్నారు.
అవును... నేపాల్, థాయిలాండ్ కు చెందిన సుమారు 22 మందిని హమాస్ ముష్కరులు హత్య చేశారని తెలుస్తుంది. దీంతోపాటు అమెరికన్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇప్పటికే ప్రకటించారు. మృతుల్లో బ్రిటన్ వాసులూ ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో విదేశీ జర్నలిస్టులు కూడా ఉన్నారని సమాచారం.
ఇందులో భాగంగా... తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ఇజ్రాయెల్ లో ప్రాణాలు కోల్పోయారని థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించగా.. 10 మంది నేపాలీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో హమాస్ జరిపిన దాడిలో 9 మంది అమెరికన్లు మరణించారు. వీరితోపాటు ఒక కెనడా వాసి, మరో ఫ్రెంచ్ మహిళా చనిపోయినట్లు చెబుతున్నారు.
బెదిరిన హమాస్... బ్లాక్ మెయిల్ హెచ్చరికలు:
తమ దాడి ఇప్పుడే ప్రారంభమైందని, ఇజ్రాయెల్ సైన్యం మునుపెన్నడూ లేనివిధంగా హమాస్ పై దాడి చేస్తోందని, శత్రువులకు తరతరాలు వణుకు పుట్టేలా ఈ పోరాటాన్ని ముగిస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేయడంతోపాటు.. గాజాను అష్టదిగ్భందనం చేయడంతో హమాస్ బ్లాక్ మెయిల్ కు దిగింది!
ఇందులో భాగంగా... ముందస్తు హెచ్చరికలు చేయకుండా గాజాలోని నివాసాలపై దాడులు చేస్తే తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను చంపేస్తామని హెచ్చరించింది. హమాస్ లోని ఖస్సాం బ్రిగేడ్స్ అధికార ప్రతినిధి ఈ మేరకు ఒక ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఆరోపించడం గమనార్హం.