ఇజ్రాయెల్-హమాస్ వార్ ఎఫెక్ట్: మస్క్ వర్సెస్ సునాక్!
ఎలాన్ మస్క్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ప్రపంచ కుబేరుడుతోపాటు.. సోషల్ మీడియా దిగ్గజ వేదిక 'ఎక్స్'కు ఆయన అధినేత
By: Tupaki Desk | 27 Nov 2023 3:22 PM GMTఎలాన్ మస్క్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ప్రపంచ కుబేరుడుతోపాటు.. సోషల్ మీడియా దిగ్గజ వేదిక 'ఎక్స్'కు ఆయన అధినేత. అంతేకాదు.. టెస్లా అధినేత కూడా. ఇక, రుషి సునాక్. ఈయనకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్రిటన్ ప్రధాన మంత్రి. అయితే.. ఒకప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం చిగురించగా.. ఆత్మీయత పరవళ్లు తొక్కగా.. ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నేపథ్యంలో యూదులకు వ్యతిరేకంగా మస్క్ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. యూదులను వ్యతిరేకిస్తున్న వచ్చిన సందేశాలకు మద్దతుగా వ్యవహరించిన తీరు ఇప్పుడు వీరి మధ్య వివాదానికి దారి తీసింది.
ముఖ్యంగా మస్క్ వ్యవహరించిన తీరుపుపై బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఫైర్ అయ్యారు. ''యూదు వ్యతిరేకతను ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తా. యూదులను వ్యతిరేకించేవారు ఎవరైనా .. తప్పేనని చెబుతా. అది మస్క్ అయినా.. బజారు మనిషైనా!'' అని సునాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలేంటి వివాదం..
ఇజ్రాయెల్-హమాస్ యుద్దంలో యూదులు చాలా మంది మృతి చెందారు. వీరి యుద్ధం కారణంగా యూదులు ప్రాణాలు కాపాడుకుంటూ.. పొరుగు దేశాలకు పయనమయ్యారు. దీనిని అంతర్జాతీయ సమాజం కూడా సానుభూతి వ్యక్తం చేసింది. అయితే.. ఇదేసమయంలో యూదులను వ్యతిరేకిస్తూ.. మస్క్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో అనేక మంది వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మస్క్ కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు.. తాను కూడా.. యూదులకు వ్యతిరేమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర వివాదానికి దారితీశాయి.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం.. సానుభూతి, పరస్పర సహకారం, శాంతి దిశగా అడుగులు వేస్తుంటే.. ఇలా.. ఒక వర్గాన్ని, బాధితులను టార్గెట్ చేసుకుని కనీస సానుభూతి లేకుండా.. వ్యాఖ్యలు చేయడం ఏంటనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల మస్క్ చేసిన వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఇదే విషయంపై రుషి సునాక్ కూడా.. తప్పుబట్టారు.
''నేను చాలా మందితో చర్చలు జరుపుతాను. అయితే వారి వ్యక్తిగత అభిప్రాయాలపై నేను దృష్టి సారించాలనుకోవడం లేదు. వాస్తవానికి నేను యూదు వ్యతిరేకతను అసహ్యించుకుంటాను. అది ఎలాన్ మస్క్ అయినా సరే.. వీధుల్లో ఉండే వ్యక్తి అయినా సరే.. ఇతరులను దుర్భాషలాడటం తప్పే. యూదు వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా సరే అది పూర్తిగా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను'' అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ వెల్లడించారు.