ఇరాన్ నో అన్నది.. ఏ క్షణమైనా పేలనున్న బాంబు.. పశ్చిమాసియా
తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ హనియా హత్యపై ఇరాన్ ఇంకా రగులుతూనే ఉంది.
By: Tupaki Desk | 14 Aug 2024 10:29 AM GMTబ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.. నాటో దేశాలైన ఈ మూడూ రంగంలోకి దిగి ఇరాన్ కు నచ్చజెప్పజూశాయి.. అమెరికా, ఖతర్, ఈజిప్ట్ లు ఇజ్రాయెల్- హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నించాయి.. కానీ, ఇవేమీ సఫలం అయ్యేలా లేవు. యుద్ధం ఆగేలా లేదు.. పది నెలలుగా పుండులా సలుపుతున్న పశ్చిమాసియా ఇకపై పెద్ద గాయంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమూ తప్పదనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడిక చేయగలిగింది.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకోవడమే..
ఇరాన్ అగ్గిమీద గుగ్గిలం
తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ హనియా హత్యపై ఇరాన్ ఇంకా రగులుతూనే ఉంది. తీవ్ర ప్రతీకారంతో ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధం అని గతంలోనే ప్రకటించింది. అది ఈ వారంలోనే ఉంటుందని, ఇందకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నట్లు
తాజాగా అమెరికా నిఘా విభాగం ఇజ్రాయెల్ ను హెచ్చరించింది. అయితే, ఇరాన్ ను బుజ్జగించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాధినేతలు
ప్రయత్నించారు. దాడులు చేస్తే పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని నచ్చజెప్పారు. అయితే, దీనిని ఇరాన్ చెవికెక్కించుకోలేదు. ఇస్మాయిల్ హనియెతో పాటు లెబనాన్ లో హెజ్‌బొల్లా కమాండర్ ఫాద్ షుకూర్ హత్యకు కారణం ఇజ్రాయెల్ అన్నది ఇరాన్ ఆరోపణ. దీంతోనే తన అనుకూల ఉగ్రసంస్థలైన హమాస్, హెజ్బొల్లాలతో కలిసి ఇజ్రాయెల్ పై దాడికి సిద్దం అవుతోంది.
శాంతి ప్రయత్నాలకు విఘాతం..
ఓవైపు ఇరాన్ నో అంటుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య పది నెలలుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. యుద్ధం ముగింపు ఒప్పందం చేసుకోవాలని ఖతర్, ఈజిప్ట్, అమెరికా కోరాయి. కొన్నాళ్లుగా ఈ దేశాలు శాంతి ప్రయత్నాలు చేస్తున్నాయి. చర్చలూ జరిగాయి. ఆగస్టు 15న గురువారం చర్చలు తిరిగి ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ఇరాన్ వైఖరి బయటపడింది. దీంతో హమాస్ కూడా యుద్ధానికి సిద్ధం అని అర్థం అవుతోంది. ఇరాన్ ను కాదని హమాస్ ఏమీ చేయలేని పరిస్థితి. కాగా, ఎర్ర సముద్రంలో మంగళవారం లైబీరియా చమురు నౌకపై మూడుసార్లు దాడులు జరిగాయి. ఇది ఇరాన్ అనుకూల యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారుల పనే.
గత ఏప్రిల్ ఇరాన్ దాడులను తన ఐరన్ డోమ్ తో సమర్థంగా ఎదుర్కొన్నది ఇజ్రాయెల్. మళ్లీ ఇప్పుడు క్షిపణులతో ఇరాన్ దాడికి దిగితే ఇజ్రాయెల్ గట్టిగానే బదులివ్వడం ఖాయం. అయితే, దీనికి తాము మద్దతిస్తామని అమెరికా తెలిపింది. ఇజ్రాయెల్ కు రక్షణగా అత్యాధునిక జలాంతర్గామితో పాటు విమాన వాహక నౌక అబ్రహం లింకన్ ను హుటాహుటిన తరలిస్తోంది. మరింత వేగంగా చేరుకోవాలని ఆదేశించింది. ఇదేకాక 20 బిలియన్ డాలర్ల ఆయుధ విక్రయాల ఒప్పందానికీ అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో పలు ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అడ్వాన్స్ డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, 120 ఎంఎం ట్యాంక్ మందుగుండు సామగ్రి, అధిక పేలుడు మోర్టార్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ప్రపచంలోనే అత్యుత్తమ ఆయుధాలున్న ఇజ్రాయెల్ కు అమెరికా అందజేసే ఆయుధాలు తోడైతే ఇక ఆ దేశం మరింత దుర్బేధ్యంగా మారుతుంది.