Begin typing your search above and press return to search.

పేజర్లు కొనిపించి మరీ.. హిజ్బుల్లా చుట్టూ మొస్సాద్ సాలె గూడు

1940ల్లో జర్మనీలో నియంత హిట్లర్ ఆదేశాలతో యూదులను ఊచకోత కోశాడో సైనికాధికారి.

By:  Tupaki Desk   |   17 Oct 2024 11:16 AM GMT
పేజర్లు కొనిపించి మరీ.. హిజ్బుల్లా చుట్టూ మొస్సాద్ సాలె గూడు
X

1940ల్లో జర్మనీలో నియంత హిట్లర్ ఆదేశాలతో యూదులను ఊచకోత కోశాడో సైనికాధికారి. ఆ మారణ హోమం ముగిసి.. ఇజ్రాయెల్ ఏర్పడ్డాక ఆ సైనికాధికారి ఎక్కడో అర్జెంటీనాలో ఓ పనివాడిగా దాక్కున్నాడు. సాధారణంగా అయితే అతడిని పట్టుకోవడం కష్టం. కానీ, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అంటే సాధారణమైనది కాదు కదా. ఆ జర్మనీ సైనికాధికారిని చాకచక్యంగా ఎత్తుకొచ్చింది. తమ దేశంలోనే కసి కొద్దీ చంపింది. ఇదీ మొస్సాద్ సత్తా. అలాంటి మొస్సాద్ ఇప్పుడు ఉగ్ర సంస్థ హిజ్బుల్లాను చావు దెబ్బ కొట్టింది. అది కూడా కేవలం టెక్నాలజీనేతోనే.

ఎర వేసి.. ఉచ్చులోకి లాగి..

హిజ్బుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ. ఇజ్రాయెల్ పొరుగునే ఉంటూ కంట్లో నలుసుగా మారింది. ఇక ఏడాది నుంచి సాగుతున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలోకీ వేలు పెడుతోంది. దీంతో హిజ్బుల్లాలను వారి వేలితోనే వారి కంట్లో పొడిచేలా చేసింది మొస్సాద్. ఆ ఉగ్ర సంస్థ చుట్టూ ఓ పెద్ద ఉచ్చు అల్లింది. అదెలా ఉంటుందంటే.. ఓ సాలె గూడును తలపించింది.

పేజర్ల పీడకల..

గత నెలలో లెబనాన్ లో పేజర్లు వేలకొద్దీ పేలి హిజ్బుల్లా ఉగ్రవాదులు, మద్దతుదారులు చనిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది గాయపడ్డారు కూడా. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ల కాలంలోనూ పేజర్లు వాడడం ఏమిటి? అందులోనూ లక్షన్నర రాకెట్లు ఉన్న హిజ్బుల్లాలను పేజర్లను ఉపయోగిస్తున్నారా? అనే అనుమానాలు కలిగాయి. అయితే, దీనికి పెద్ద కారణమే ఉంది. ఉద్దేశపూర్వకంగా ముందుగా సెల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా హిజ్బుల్లాలను వేటాడింది ఇజ్రాయెల్‌. దీంతో హిజ్బుల్లాలు పేజర్లను కొనేలా చేసింది. సెల్ ఫోన్లను పక్కనపడేసి పేజర్లను కొనాలని ఆదేశాలిచ్చింది హిజ్బుల్లా అధినేత, ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన హసన్ నస్రల్లానే కావడం గమనార్హం. అలా ‘మొస్సాద్‌ పేజర్లు’ లెబనాన్‌ లోకి వచ్చాయి.

ఉచ్చు పన్ని.. అందులోకి వచ్చేలా

మనందరం సాలె గూడును చూసి ఉంటాం.. హెజ్బొల్లా చుట్టూ ఆ విధమైన గూడే పన్నింది మొస్సాద్. అందులో భాగంగానే పేజర్లు కొనేలా చేసింది. అవి పేలడంతో హిజ్బుల్లాల వేలాదిమంది కేడర్ కకావికలమైంది. కాగా, హిజ్బుల్లాలు కొన్నది ఏఆర్‌-924 పేజర్లు. వీటిలో మొస్సాద్ తమదైన ప్రత్యేక బ్యాటరీని డిజైన్‌ చేసి మరీ అమర్చింది. 35 గ్రాముల లిథియం అయాన్‌ బ్యాటరీ కేసింగ్‌ అందులో అమర్చారు. ఈ సైజుది 8.75 వాట్‌ అవర్‌ శక్తిని ఇవ్వాలి. మొస్సాద్‌ బ్యాటరీలు 2.22 వాట్‌ అవర్‌ మాత్రమే వచ్చేది. కేసింగ్‌ లోని 2 లిథియం అయాన్‌ బ్యాటరీల మధ్య 6 గ్రాముల పీఈటీఎన్‌ పేలుడు పదార్థాన్ని, స్పార్క్‌ జనరేటర్‌ ను అమర్చింది. బ్యాటరీ కేసింగ్‌ లోహంతో కాకుండా వేగంగా మండే పదార్థంతో చేసింది.

ఎక్స్ రేలకు దొరక్కుండా..

పేజర్లను హిజ్బుల్లాలు విమానాశ్రయ స్కానర్లలో ఉంచి మరీ తనిఖీ చేశారు. కానీ, పీఈటీఎన్‌ ఆ ఎక్స్‌ రేలకు దొరకలేదు. అలారం మోగకపోవడంతో హిజ్బుల్లాలకూ అనుమానం రాలేదు. మరో విచిత్రం ఏమంటే.. పేలుడు జరిగే రోజు వరకు హిజ్బుల్లాలు తమ కేడర్ కు పేజర్లు సరఫరా చేస్తూనే ఉన్నారు. ఓ దశలో బ్యాటరీ తరచూ డౌన్‌ కావడంతో అనుమానం వచ్చినా.. పేలుడు పదార్థాలను మాత్రం పసిగట్టలేకపోయింది. బ్యాటరీపై ఉండే LI-BT783 లేబుల్‌ ఉండడమూ దీనికి కారణమే. ఈ బ్యాటరీలు మార్కెట్లో లేవు. అయితే, హిజ్బుల్లాలకూ ఈ అనుమానమూ రానీయలేదు మొస్సాద్.

ప్రత్యేక వెబ్ సైట్ పెట్టి..

బ్యాటరీలపై అనుమానం వచ్చిన హిజ్బుల్లాలు వాటిని ఇంటర్నెట్ లో తనిఖీ చేస్తారనే అంశం తెలిసి.. మొస్సాద్‌ ఏకంగా ప్రత్యేక వెబ్ సైట్ నే రూపొందించింది. అందులో ప్రకటనలు, వీడియోలు కూడా ఉంచడం గమనార్హం. అయితే, పేజర్లను హిజ్బుల్లాలకు అమ్మేందుకు మొస్సాద్‌ గోల్డ్‌ అపోలో సంస్థ మాజీ ఉద్యోగిని థెరిస్సా వూ ను ఉపయోగించుకుంది. ఆమె ద్వారా టామ్‌ అనే వ్యక్తి తైవాన్ కు చెందిన గోల్డ్‌ అపోలో అధిపతి చింగ్‌ కువాంగ్‌ తో చర్చలు జరిపాడు. వాస్తవానికి ఈ టామ్‌ ఎవరో చింగ్ కు తెలియదు. అయినా గోల్డ్‌ అపోలో బ్రాండ్‌ ను వాడుకొనేందుకు అమనుతి ఇచ్చాడు. టామ్ అభ్యర్థన మేరకు తమ వెబ్‌ సైట్లో ఏఆర్‌-924 పేజర్ల యాడ్‌ పెట్టారు. అసలు ఈ పేజర్లు తైవాన్‌ లో దొరకవు. కానీ, అక్కడే దొరుకుతాయని నమ్మించిన మొస్సాద్.. హిజ్బుల్లాలను కుప్పకూల్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడి చేయాలంటే వీరికి మానసిక స్థైర్యం చాలడం లేదు. దీనికి కారణం ఎప్పుడు ఎక్కడ పేలుడు జరుతుందోనని.