భూమి కంపించేలా ఇజ్రాయెల్ భీకరదాడి... రిక్టర్ స్కేలుపై ఎంతంటే..?
సిరియాలో తిరుగుబాటుదారుల ఎఫెక్ట్ తో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2024 9:34 AM GMTసిరియాలో తిరుగుబాటుదారుల ఎఫెక్ట్ తో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గతంలో కెమికల్ ఆయుధాలతో తమపై సిరియా చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో.. ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది! తాజాగా జరిపిన దాడికి భూమి కంపించిందంటే తీవ్రత అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.
అవును... ఈ ఏడాది అంతా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఫుల్ బిజీగా గడిపిందనే చెప్పాలి. గాజాలో హమాస్ పై మొదలైన దాడులు.. హెజ్ బొల్లా, ఇరాన్ మీదుగా ఇప్పుడు సిరియా వరకూ చేరాయి. ఈ క్రమంలో... సిరియా స్థావరాలే లక్ష్యంగా ఇప్పటికే 48 గంటల్లో 350 సార్లు దాడులు చేసినట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తాజాగా సిరియాలోని కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన భీకరదాడితో భూమి ఒక్కసారిగా కంపించిందని చెబుతున్నారు. దీని తీవ్రత భూ ప్రకంపనలను కొలిచే సాధనం రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదయ్యాయని అంటున్నారు. దీంతో... ఈ విషయం అత్యంత సంచలనంగా మారిందని చెబుతున్నారు.
ఈ విషయాన్ని యుద్ధాలను ట్రాక్ చేసే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓ.ఎస్.ఐ.ఎన్.టీ) డిఫెండర్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఈ పేలుడు 820 కి.మీ. దూరంలోని పశ్చిమ తుర్కియే సిటీ ఇస్నిక్ లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. భూకంపం కంటే రెండు రెట్ల వేగంతో ప్రకంపనలు వచ్చాయని అంటున్నారు!.
ఇదే సమయంలో... దీని పేలుడు వల్ల సంభవించిన అగ్ని గోళం కొన్ని కిలోమీటర్ల మేర కనిపించిందని.. 2012 నుంచి ఇప్పటివరకూ సిరియాపై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారని అంటున్నారు. మరోపక్క.. ఈ సిటీలోనే రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధకారాగారాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు!
సిరియాలో ఆహార సంక్షోభం!:
ఇంతకాలం అంతర్యుద్ధంతో అల్లలాడిపోయిన సిరియా ప్రజలు.. ఇప్పుడు అధ్యక్షుడు అసద్ పారిపోయిన తర్వాత తిరుగుబాటు దారుల ఆక్రమణతో కాస్త ఉపశమనం పొందినట్లు కనిపించారట. ఈ లోపే ఆ ఇజ్రాయెల్ రూపంలో భీకరదాడులు వణికిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో తీవ్ర ఆహార సంక్షోభం తెరపైకి వచ్చింది.
ఈ విషయాలపై స్పందించిన ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూ.ఎఫ్.పీ.) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్ స్కా... సుమారు మూడు బిలియన్ల మందికిపైగా ప్రజలు సిరియాలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నారని.. నిధుల కొరత కారణంగా.. డబ్ల్యూ.ఎఫ్.పీ. కూడా కేవలం మూడింట రెండు వంతుల మందికి మాత్రమే సహాయం అందించ గలుగుతున్నామని తెలిపారు.