బైక్ పై ఛేజ్ చేస్తూ ఉగ్రవాదులపై కాల్పులు... వీడియో వైరల్!
"మొదలుపెట్టింది వాళ్లైనా... ముగించేది మాత్రం మేమే" అంటూ ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ కి అనుగుణంగానే పరిస్థితులు మారుతున్నాయి
By: Tupaki Desk | 10 Oct 2023 10:27 AM GMT“మొదలుపెట్టింది వాళ్లైనా... ముగించేది మాత్రం మేమే” అంటూ ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ కి అనుగుణంగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇజ్రాయేల్ అలసత్వాన్ని వూహాత్మకంగా ఒడిసిపట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు ముందుగా ఊహించని దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇజ్రాయేల్ సైన్యం మేల్కొనేలోపు మారణహోమం సృష్టించారు.
ఇదే సమయంలో తేరుకున్న ఇజ్రాయేల్ అంతకుమించి అన్నట్లుగా ప్రతిదాడి చేస్తుంది. ఇప్పటికే హమాస్ గుండెకాయ గాజాను అష్ట దిగ్బంధనం చేసిన ఇజ్రాయేల్ సైన్యం... సరిహద్దుల్లో 1500 మంది హమాస్ ఉగ్రవాదుల డెడ్ బాడీస్ ని కైవసం చేసుకున్నట్లు తెలిపింది. సరిహద్దు మొత్తం తమ అధీనంలోకి వచ్చినట్లు వెల్లడించింది.
ఇదే క్రమంలో గాజాలోని హమాస్ స్థావరాలతోపాటు.. ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అక్కడి పోలీసులు చేపడుతున్న ఆపరేషన్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు హమాస్ మిలిటెంట్లను వెంటాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
అవును... ఇజ్రాయెల్ సైన్యంతో పాటు ఆ దేశపు బోర్డర్ పోలీసులు హమాస్ మిలిటెంట్లను వెంటాడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డుపై కారులో వెళ్తున్న హమాస్ ఉగ్రవాదిని వెంటాడి వేటాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో ఛేజింగ్ సీన్ ను తలదన్నేలా ఉన్న ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసు విభాగం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆశ్చర్యగొలిపేలా ఉన్నాయి. ఇందులో భాగంగా... హమాస్ మిలిటెంట్లు ప్రయాణిస్తున్న కారును ఇజ్రాయెల్ పోలీసు బైక్ పై వెంబడించాడు. ఈ క్రమంలో మిలిటెంట్ల కారు సమీపంలోకి వెళ్లి బైక్ పై నుంచి ఒంటి చేత్తోనే తుపాకీతో కాల్పులు జరిపాడు. హమాస్ ఉగ్రవాది తన కారును ఆపేంత వరకూ కాల్పులు జరపడం వీడియోలో చూడొచ్చు.
ఇదే సమయంలో ఆ బైక్ తో పాటు మరో కారులో అతడి వెనుకే వచ్చిన ఇజ్రాయెల్ పోలీసులు మరోసారి మిలిటెంట్లపై పలు రౌడ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు పోలీసు బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇజ్రాయేల్ పోలీసులను ప్రశంసిస్తున్నారు.
మీ ఊహకే వదిలేస్తున్నాం... ఇజ్రాయేల్ వార్నింగ్:
హమాస్ దాడులు ప్రకటించిన అనంతరం ఆ షాక్ నుంచి తేరుకున్నప్పటినుంచీ ఇజ్రాయేల్ మాటల్లోనూ, చేతల్లోనూ ఘాటుగానే రియాక్ట్ అవుతుంది. ఇందులో భాగంగా... ఇప్పటికే గాజాకు నీరు, ఆహారం ఆపేసిన ఇజ్రాయేల్... ఇజ్రాయేల్ శత్రుదేశాలు పదితరాలపాటు గుర్తుంచుకునేలా తమ రియాక్షన్ ఉంటుందని తెలిపింది!
ఇదే క్రమంలో... ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకువెళ్లిన బందీలకు ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) హెచ్చరికలు జారీ చేసింది. బందీలుగా ఉన్నవారిలో ఒక్క వృద్ధురాలికైనా.. ఒక్క పసికందుకైనా చిన్న హాని జరిగినా.. రియాక్షన్ మీ ఊహకు వదిలేస్తున్నామన్నట్లుగా ఇజ్రాయేల్ వార్నింగ్ ఇచ్చింది.