యుద్ధం నష్టానికి మించి ఇజ్రాయెల్ పరువు పాయె
ప్రపంచ దేశాల్లో సాంకేతికంగా కానీ.. నిఘా వ్యవస్థకు సంబంధించి పేరున్న దేశాల్లో టాప్ 5లొ ఉంటుంది ఇజ్రాయెల్ నిఘా వ్యవస్
By: Tupaki Desk | 9 Oct 2023 5:32 AM GMTప్రపంచ దేశాల్లో సాంకేతికంగా కానీ.. నిఘా వ్యవస్థకు సంబంధించి పేరున్న దేశాల్లో టాప్ 5లొ ఉంటుంది ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ. ప్రపంచంలోని ఏ టార్గెట్ అయినా సరే.. ఇట్టే ఛేదించే సత్తా ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థకు ఉందన్న పేరుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ నిఘా సంస్థకున్న పేరు ప్రఖ్యాతులన్ని తుడిచిపెట్టేసేలా చోటు చేసుకున్న హమస్ దాడులు.. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థను కోలుకోలేనంత భారీగా దెబ్బ తీశాయని చెప్పాలి.
డజన్ల కొద్దీ సాయుధులు ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్ మధ్యనున్న పటిష్టమైన రక్షణ కంచెను బుల్డోజర్ లతో కూల్చేసి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించటం ఒక ఎత్తు అయితే.. నిమిషాల వ్యవధిలో వేలాది రాకెట్లను ప్రయోగించటం.. సరిహద్దుల్లోకి ప్రవేశించి.. కనిపించిన వారిని కనిపించినట్లుగా పిట్టల్లా కాల్చేసిన వైనం గురించి తెలిసినప్పటి నుంచి తీవ్రమైన షాక్ కు గురైన దుస్థితి.
ఇజ్రాయెల్ అన్నంతనే దాని నిఘా వ్యవస్థ షిన్ బెట్ కానీ.. గూఢాచార సంస్థ అయినా మొసాద్ లు.. ఇంతలా ఎలా ఫెయిల్ అయి ఉంటాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దాడులకు సంబంధించి సమాచారం ముందే ఉండి ఉన్నప్పటికి దాడుల్ని అడ్డుకోలేకపోవటం అయితే.. అంతకు మించిన దారుణ వైఫల్యం మరొకటి ఉండదు. నిధుల కొరత అన్నదే లేని ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ.. ఇంత భారీ దాడుల్ని ముందస్తుగా ఎందుకు గుర్తించలేకపోయింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇజ్రాయెల్ సీక్రెట్ సంస్థకు సంబంధించిన ఏజెంట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ల గ్రూపులతో పాటు లెబనాన్.. సిరియా.. ఇలా పలు దేశాల్లో వారి ఏజెంట్లు ఉన్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందన్న పేరు ప్రఖ్యాతులున్నప్పటికి ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్నది చర్చనీయాంశంగా మారింది. డ్రోన్లతోనూ.. ఏజెంట్ల సాయంతో కార్లకు జీపీఎస్ పరికరాల్ని అమర్చి.. వాటిని ట్రాక్ చేసి దాడులు చేపట్టటం.. సెల్ ఫోన్ పేలుళ్లతోనూ దాడులకు పాల్పడే ఇజ్రాయల్ నిఘా వ్యవస్థకు ఏమైంది? శత్రువుల కదలికల్ని ట్రాక్ చేసే విషయంలో చోటు చేసుకున్న వైఫల్యం ఇప్పుడా దేశ వాసుల్ని మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు మాత్రం నమ్మశక్యం కానిదిగా మారింది.