ఆర్టికల్ 2 : ప్రపంచమా కళ్లు తెరు.. పాలస్తీనా పిల్లల మరణాలు చూడు.. భారత క్రికెటర్
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. ఉగ్ర సంస్థను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీలోకి చొచ్చుకెళ్తున్నాయి.
By: Tupaki Desk | 3 Nov 2023 9:23 AM GMTఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. ఉగ్ర సంస్థను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీలోకి చొచ్చుకెళ్తున్నాయి. గాజాను మూడు వైపుల నుంచి ముట్టడించి భూతల దాడులను ముమ్మరం చేస్తున్నాయి. కాగా, హమాస్ ఉగ్రవాదులు బుధవారం రాత్రంతా ట్యాంకు విధ్వంసక క్షిపణులను, పేలుడు పదార్థాలను, గ్రనేడ్లను ప్రయోగించారు. ఇటు ఇజ్రాయెల్ దళాలు శతుఘ్నలను ప్రయోగించాయి. హెలికాప్టర్, యుద్ధ నౌక నుంచి దాడులు చేశాయి.
ప్రజల ప్రాణాలు గాలిలో..
గాజా సిటీలోని జనం మధ్యలో పోరు సాగుతుండటంతో ప్రాణ నష్టం అధికంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది కూడా. కానీ, ఉన్న పూరు, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదలి అంత తొందరగా వెళ్లలేని వారు అక్కడే ఉండిపోతున్నారు. ఇలాంటివారు వేలాదిమంది ఉన్నారు. అయితే, ఈ సమయంలో ఆశాకిరణంలా శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా, అరబ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కనీసం గాజా పౌరులకు సాయం చేయడానికి కాల్పులకు స్వల్ప విరామం ఇవ్వాలని సూచిస్తున్నాయి. మానవతా సాయానికి వీలుగా కాల్పులకు కాస్త విరామం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
మరణించినవారిలో మూడో వంతు చిన్నారులే..
వేలాది రాకెట్లతో అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడితో మొదలైంది అసలు సమస్య. రేపటితో మూడు వారాలు పూర్తికానుంది. ఇజ్రాయెల్ తేరుకుని ఎదురుదాడికి దిగుతుండడంతో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. వారానికి మూడు వేల మంది చొప్పున ఇప్పటివరకు 9 వేలమందిపైగా గాజాలోని పాలస్తీనీయులు చనిపోయారు. విషాదం ఏమంటే.. ఇందులో 3,600 మంది పిల్లలేనట. ఏకంగా 32వేల మంది గాయపడ్డారని కథనాలు వస్తున్నాయి. వీరిలోనూ పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఓ ప్రపంచమా? ఎందుకింత మౌనం..?
ఎక్కడ ఘర్షణలు జరిగినా, పిల్లలు, మహిళలు, పెద్ద వయస్కులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఎందుకంటే వీరు మరొకరి సాయం లేకుండా యుద్ధ క్షేత్రాల నుంచి బయటపడలేరు కాబట్టి. మరోవైపు పాలస్తీనాలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. పెద్ద సంఖ్యలో అమాయక చిన్నారులు బలవుతుండడంపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ ప్రపంచమా? ఎందుకింత మౌనం అన్ని ప్రశ్నించాడు. పాలస్తీనా లో పిల్లల మరణాలపై ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్పందించారు. వారిలో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతడు.. ప్రపంచ నేతలంతా ఏకమై, నరమేధానికి అంతం పలకానికి విన్నవించాడు. ‘‘ప్రతి రోజూ గాజాలో పదేళ్లలోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ క్రీడాకారుడిగా నేను నా ఆవేదనను మాత్రమే వ్యక్తం చేయగలను. కానీ, ప్రపంచ నేతలు ఏకమైతే దీనిని అంతం పలకొచ్చు’’ అంటూ ‘‘ఎక్స్’’ లో పోస్ట్ చేశాడు. కాగా, గుజరాత్ కు చెందిన ఇర్ఫాన్ పఠాన్ 2004 సమయంలో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ తరహాలో మేటి ఆల్ రౌండర్ అవుతాడని భావించినా, ఆ స్థాయిని అందుకోలేకపోయాడు. బ్యాట్ తో రాణించినా.. అసలైన బలమైన బౌలింగ్ లో గాడితప్పి జట్టుకు దూరమయ్యాడు. రీ ఎంట్రీలోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఇర్ఫాన్ అన్న యూసుఫ్ పఠాన్ కూడా టీమిండియాకు ఆడాడు. వీరిద్దరూ 2007 టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.