గాజాపై భూతల దాడి... బందీలే మృతి అంటున్న హమాస్!
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం గాజాపై వైమానిక దాడులు ఎడతెరిపి లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Oct 2023 4:20 AM GMTహమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం గాజాపై వైమానిక దాడులు ఎడతెరిపి లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాజాపై ఇజ్రాయెల్ బుధవారం రాత్రి సుమారు 250 వైమానిక దాడులు చేసింది. ఈ స్థాయిలో జరుగుతున్న దాడులతో పాటు తాజాగా భూతల దాడుల విషయంలో కూడా ఇజ్రాయేల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక రౌండ్ వేసి వచ్చేసింది!
అవును... గాజాపై భూతల దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కాచుకుని కూర్చున్న ఇజ్రాయేల్ సైన్యం ఆ పనికూడా మొదలుపెట్టేసింది! ఇందులో భాగంగా... ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై అర్థరాత్రి యుద్ధట్యాంకులు భూతల దాడులు చేసి వెనక్కు వచ్చాయి. ఇది జస్ట్ ట్రైల్ రన్ గా జరిపినట్లు కథనాలొస్తున్నాయి.
ఈ సమయంలో స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్)... కొన్ని గంటలపాటు ఉతర గాజాలో భూతల దాడులు జరిపైనట్లు తెలిపారు. అలా కొనసాగిన ఈ దాడుల్లో హమాస్ కు సంబంధించిన మొత్తం 250 స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. హమాస్ మౌలిక వసతులు, కమాండ్ సెంటర్లు, సొరంగాలు, రాకెట్ లాంచర్లే లక్ష్యంగా భూతల దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
అయితే ఈ భూతల దాడుల సమయంలో తాము కొన్ని కీలక విషయాలు గమనించినట్లు ఇజ్రాయేల్ సైన్యం చేబుతుంది. ఇందులో భాగంగా జనావాసాల మధ్యే హమాస్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఇదే సమయంలో... జనావాసాల మధ్యే హమాస్ రాకెట్ లాంచర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మిలిటెంట్ల మౌలిక సదుపాయాలపై దాడులు చేశామని తెలిపింది.
దీంతో సుమారు 3.6 లక్షల మందితో సిద్ధంగా ఉన్న సైన్యం పూర్తిస్థాయిలో భూతల దాడులకు దిగబోతుందని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంటే... ఉత్తర దక్షిణ గాజాలపై వైమానిక దాడులు యదావిదిగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... గాజాపై ఇజ్రాయెల్ బుధవారం రాత్రి 250 వైమానిక దాడులు చేసింది. మరోవైపు మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల్లో డజన్ల మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మరోవైపు ఈ నెల 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ 224 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు కొందరు విదేశీయులూ ఉన్నారు. అయితే తాజాగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న భీకర దాడుల కారణంగా తమవద్ద బందీలుగా ఉన్న వారిలో 50 మంది మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది.