Begin typing your search above and press return to search.

శవాలదిబ్బగా గాజా... మృతదేహాలకు పార్కింగ్ ప్లేస్ గా షిఫా!

ఇదే సమయంలో... గాజాపై ముందుగా చెప్పినట్లుగానే హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తోంది

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:06 AM GMT
శవాలదిబ్బగా గాజా... మృతదేహాలకు పార్కింగ్ ప్లేస్ గా షిఫా!
X

ఏ ఆలోచనతో హమాస్ ఉగ్రవాదులు ముందుకు వెళ్లారో.. ఇజ్రాయేల్ పై దాడి చేసేశామని మురుసిపోయారో తెలియదు కానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం వారు పశ్చాత్తాపపడే స్థాయిలోకి వెళ్లిపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం... గాజాపై ఇజ్రాయేల్ సైన్యం పెట్టిన గురి, జరుగుతున్న దాడులు, విలవిల్లాడుతున్న ప్రజల ప్రాణాలు వెరసి... ప్రస్తుతం హిరోషిమా, నాగసాకీ లను గుర్తుకు తెస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవును... రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడికి బలైన హిరోషిమా, నాగసాకీల తరహాలో గాజా పరిస్థితి అంత దయణీయంగా మరింపోయిందని అంటున్నారు పరిశీలకులు. అణుబాంబు దాడి అయితే జరగలేదు కానీ... మిగిలిన పరిస్థితులు, ప్రభావం మొత్తం అదే స్థాయిలో ఉందని అంటున్నారు. ఆల్ మోస్ట్ సిటీ మొత్తం నేలమట్టం అయ్యే పరిస్థితి నెలకొందనే మాటలు వినిపిస్తున్నాయి.

ముందుగా చెప్పినట్లుగానే గాజాను అష్టదిగ్భందనం చేసేసింది ఇజ్రాయేల్. ఇప్పటికే ఆహారం, ఇందనం అందకుండా చేసిన ఇజ్రాయేల్.. విద్యుత్ సరఫరానూ బంద్ చేసింది. దీంతో... మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉంటే ఆకలి చావులు వందల్లో ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే విద్యుత్ సదుపాయం లేక గాజా మొత్తం అంధకారంలో చిక్కుకుందని చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌ ఆహారం, ఇంధనం, విద్యుత్తు నిలిపేయడంతో గాజాలో ప్రజలు ఆకలికి అలమటించి చనిపోతారేమోననే అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళనను వ్యక్తం చేశాయి. మరోపక్క అటు ఈజిప్టు సరిహద్దు మూసి ఉండటంతో వారికి మరో దారిలేదని పేర్కొన్నాయి. ఐక్యరాజ్య సమితి నడుపుతున్న షెల్టర్లలోకి లక్షల మంది ప్రజలు పోటెత్తుతున్నారు.

అయితే విద్యుత్ సరఫరా లేకపోవడంతో అప్పుడే పుట్టిన పిల్లలు, డయాలసిస్ పేషెంట్లు అత్యంత ఇబ్బంది పడుతున్నారని... ఇది ఇలానే కొనసాగితే ఇజ్రాయేల్ బాంబు దాడుల అవసరం లేకుండా అత్యంత ప్రాణనష్టం జరిగే ప్రమాధం ఉందని చెబుతున్నారు. అయితే... బందీలను విడిచిపెట్టేదాకా గాజాకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేది లేదని ఇజ్రాయెల్‌ తేల్చి చెప్పింది.

ఇదే సమయంలో... గాజాపై ముందుగా చెప్పినట్లుగానే హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ సుమారు 1,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 3,39,000 మంది షెల్టర్లలో ఉన్నారని.. 6,50,000 మందికి నీటి సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే ఆకలి చావులు అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు తోడూ ఆహారం లేక, నీళ్లు లేక.. ముఖ్యంగా విద్యుత్ అంతరాయంతో గాజాలోని ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి, మృతదేహాలతో నిండిపోతున్నాయి. ఇక గాజా నగరంలోని అతి పెద్ద షిఫా ఆసుపత్రిలో పరిస్థితి మరీ దారుణంగా మారిందని తెలుస్తుంది. అక్కడ శవాలను గుట్టగా పాడేసిన పరిస్థితి దర్శనమిస్తుందని చెబుతున్నారు.

వాస్తవానికి షిఫా ఆసుపత్రి మార్చురీలో కేవలం 30 మృతదేహాలనే భద్రపరిచేందుకు అవకాశముందట. కానీ అంతకంటే మూడు నాలుగు రెట్లు అధికంగా డెడ్ బాడీలు ఉండటంతో వాటిని గుట్టగా పాడేసి... వీలైనంత త్వరగా కుటుంబసభ్యులు గుర్తించి తీసుకెళ్లాలని కోరుతున్నారంట. దీంతో... షిఫా ఆసుపత్రి మృతదేహాలకు పార్కింగ్ స్థలంగా మారిపోయిందనే కామెంట్లు స్థానికంగా వినిపిస్తున్నాయని అంటున్నారు.