హమాస్ సొరంగాలు సాలెగూళ్లు... విడుదలైన బందీ షాకింగ్ వివరణ!
అవును... ఇటీవల మానవతా కోణంలో ఆలోచించమని చెబుతూ తమవద్ద బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ ని హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Oct 2023 1:30 AM GMTహమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడమే ఇప్పుడు తమ ముందున్న ప్రధాన కర్తవ్యం అని ఇజ్రాయేల్ సైన్యం చెబుతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సుమారు మూడున్నర లక్షలమంది సైన్యం గాజాపై భూతల దాడులకోసం బోర్డర్లో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు! మరోపక్క హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని సొరంగాల్లో దాచారని.. ఆ నెట్ వర్క్ ని ఛేదించడం అతిపెద్ద సవాల్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సొరంగాలు ఎలా ఉన్నాయో చెబుతున్నారు తాజాగా విడుదలైన బందీ!
అవును... ఇటీవల మానవతా కోణంలో ఆలోచించమని చెబుతూ తమవద్ద బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ ని హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మరో ఇద్దరు ఇజ్రాయేల్ మహిళలను విడుదల చేశారు. ఈ విషయంలో కూడా మానవతా కారణాల దృష్ట్యా ఆ ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను వదిలిపెట్టినట్టు హమాస్ తెలిపింది. ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇది సాధ్యపడిందని తెలుస్తుంది.
వృద్ధులైన ఈ ఇద్దరు మహిళలను గాజా, ఈజిప్టు మధ్య ఉన్న రఫా సరిహద్దు వద్ద విడిచిపెట్టారు. ఇదిలా ఉంటే.. హమాస్ మరో 50 మంది బందీలను విడుదల చేసే అవకాశం ఉందని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ద్వంద్వ పౌరసత్వం కలిగిన బందీలను విడిపించేందుకు రెడ్ క్రాస్ ప్రతినిధులు గాజాకు వెళ్తున్నట్లు కథనాలొస్తున్నాయి. మరోపక్క హమాస్ చెరలో ఉన్నవారి సంఖ్య 222కు చేరిందని ఇజ్రాయేల్ సైన్యం తెలిపింది.
ఆ సంగతి అలా ఉంటే... విడుదలైన ఇద్దరు మహిళల్లో ఒక మహిళ... అక్కడ జరిగిన పరిస్థితుల గురించి తెలిపింది. సొరంగాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా... ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఊహించలేదని చెప్పిన ఆమె... హమాస్ ముప్పును ఇజ్రాయెల్ తీవ్రంగా తీసుకోలేదని, వారిని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఖరీదైన ఫెన్సింగ్ ఉపయోగపడలేదని అన్నారు.
ఇదే సమయంలో... తాను బైక్ పై ఉన్నప్పుడు దారిలో ఓ యువకుడు తనను కొట్టాడని.. అయితే ఆ సమయంలో తన ఎముకలు విరగ్గొట్టలేదు కానీ.. భరించలేని నొప్పితో విలవిల్లాడిపోయినట్లు ఆమె తెలిపారు. ఆ భయంకర క్షణాలను తలచుకుంటూ... ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందని తెలిపారు. అనంతరం... తనను గాజాలో ఉన్న సొరంగాల్లోకి తీసుకెళ్లారని ఆమె వివరించారు.
ఇక హమాస్ మిలిటెంట్లు తమను బందించిన సొరంగాలు చూడటానికి సాలెగూళ్ల మాదిరిగా ఉన్నాయని తెలిపిన ఆ మహిళ... ఆ సొరంగాల్లో బందీగా ఉన్నప్పుడు వైద్యుడు ఒకరు తనను పరీక్షించినట్లు తెలిపారు. ఇక, హమాస్ తమని బాగానే చూసుకుందని.. అవసరాలను తీర్చిందని చెల్లడించారు. ఈ వివరాలు చెప్పిన ఆ మహిళ పేరు యోచివెడ్ లిఫ్సిట్జ్.. వయస్సు 85 సంవత్సరాలు కాగా... చక్రాల కుర్చీలో కూర్చొని ఆమె మీడియాతో మాట్లాడారు.