Begin typing your search above and press return to search.

పశ్చిమాసియా ‘పగలు’.. అమెరికా మరిన్ని ఆంక్షలు.. ఇరాన్ హెచ్చరికలు

ఇప్పటికే ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ కు సాయం చేస్తున్న అగ్ర రాజ్యం.. ఇక తమకు ఎప్పటినుంచో శత్రుత్వం ఉన్న ఇరాన్ ను మరింతగా దెబ్బకొట్టాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 4:47 PM GMT
పశ్చిమాసియా ‘పగలు’.. అమెరికా మరిన్ని ఆంక్షలు.. ఇరాన్ హెచ్చరికలు
X

పశ్చిమాసియా అంటేనే పగలు.. దశాబ్దాలుగా రగులుతున్న సెగలు.. ఇలాంటి సమయంలో గత ఏడాది ఇజ్రాయెల్ పై దారుణంగా దాడి చేసింది హమాస్. మరుసటి రోజు నుంచి ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఈ యుద్ధం లెబనాన్ అడ్డాగా పనిచేసే హెజ్బొల్లా, యెమెన్ హూతీల మీదుగా ఇరాన్ కూ విస్తరించింది. హమాస్, హెజ్బొల్లా నేతల హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ కొన్ని రోజుల కిందట వందల క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించడంతో పశ్చిమాసియా రగులోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ బద్ధ శత్రువు, ఇజ్రాయెల్ కు ఆప్త మిత్రుడు అయిన అమెరికా రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ కు సాయం చేస్తున్న అగ్ర రాజ్యం.. ఇక తమకు ఎప్పటినుంచో శత్రుత్వం ఉన్న ఇరాన్ ను మరింతగా దెబ్బకొట్టాలని చూస్తోంది.

కీలక రంగాలపై..

ఇరాన్ చమురు ఉత్పత్తి అధికంగా చేసే దేశం. దీంతో ఆ దేశానికి ఆర్థిక వనరులైన పెట్రోలియం, పెట్రో కెమికల్‌ రంగాలపై అమెరికా ఆంక్షలను విస్తరించింది. ఇజ్రాయెల్ పై దాడులకు దిగినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. అమెరికా ఇలా చేయడం వల్ల ఇరాన్‌ కు నిధులు వచ్చే మార్గాలు దెబ్బతింటాయి. ఇరాన్ కు చెందిన 16 సంస్థలను, 17 నౌకలను నిషేధిత ఆస్తులుగా (బ్లాక్‌ ప్రాపర్టీ) అమెరికా ప్రకటించింది. ఈ సంస్థలు ఇరాన్ ప్రభుత్ ఆధీనంలోని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీకి మద్దతుగా ఇరానియన్‌ పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపించింది. ఇజ్రాయెల్ వాస్తవానికి ఇరాన్‌ చమురు, అణు స్థావరాలపై దాడులు చేస్తుందనే ఆందోళన ఉంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్‌ పై ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించడంతోనే పెట్రోలియం, పెట్రో కెమికల్‌ రంగాలపై ఆంక్షలను పెంచినట్లు స్పష్టం అవుతోంది.

ఏ క్షణమైనా పేలనున్న బాంబు

ఒక్క ఇజ్రాయెల్.. ఏడు శక్తులతో పోరాడుతోందని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఏ క్షణంలోనైనా పేలనున్న బాంబుగా కనిపిస్తోంది పశ్చిమాసియా. ప్రజలేమో ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నారు. కాగా.. అమెరికా ఆంక్షలకు దీటుగా దాని

మిత్ర దేశాలకు ఇరాన్‌ గట్టి హెచ్చరిక చేసింది. ఏ విధంగా ఇజ్రాయెల్ కు సాయం చేసినా.. అది తమపై దాడితో సమానంగా పేర్కొంది. అదే జరిగితే తామూ తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ కు సాయం చేస్తున్న అమెరికాను ఉద్దేశించే ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇలాగైతే తర్వాత జరిగే పరిణామాలను తెలుసుకోవాలని హితవు పలికింది. ఇజ్రాయెల్ తమ శత్రువని.. దానికి సహకరిస్తే తమపై దాడి చేసినట్లేనని పేర్కొంది.