Begin typing your search above and press return to search.

200 మంది చనిపోయారు.. అమెరికాకు ముందే తెలుసు!

అయితే ఈ విషయంలో హమాస్ కాస్త బెట్టుచేస్తున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   18 March 2025 11:35 AM IST
200 మంది చనిపోయారు.. అమెరికాకు ముందే తెలుసు!
X

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి ఇటీవల అమెరికా జోక్యంతో కాస్త విరామం తీస్తుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కాల్పుల విరమణ ఒప్పందం.. బందీల విడుదల కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ విషయంలో హమాస్ కాస్త బెట్టుచేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. గాజాపై మరోసారి ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.

అవును... గాజాపై మరోసారి ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.. గజగజ లాడించింది! ఈ దాడుల్లో కనీసం 200 మంది వరకూ మృతి చెందారని తెలుస్తోంది. అయితే... ఈ ఊహించని భీకర దాడులకు ముందు అమెరికా ప్రభుత్వాన్ని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం సంప్రదించిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైట్ హౌస్ వెల్లడించింది.

అసలేం జరిగిందంటే... మీ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తామని హమాస్ కు కొద్ది రోజుల క్రితం ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని.. మరణించినవారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలని.. అలాకానిపక్షంలో తగిన ప్రతిఫలం అనుభవిస్తారని ట్రంప్ హెచ్చరించారు.

ఈ విషయంలో ఇజ్రాయెల్ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు తాము అందిస్తామని.. తాను చెప్పినట్లు చేయకపోతే హమాస్ కు చెందిన ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండరని.. ఇదే మీకు చివరి హెచ్చరిక అని.. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తోందని.. అందువల్ల మీరు ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టాలని హమాస్ ను ట్రంప్ హెచ్చరించారు.

అయితే... ట్రంప్ ఆ స్థాయిలో చెప్పినప్పటికీ హమాస్ ఆ హెచ్చరికలు బేఖాతరు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్, నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. ఇదే సమయంలో.. తమతో మరోదశ చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఒక్కసారిగా గాజాపై విరుచుకుపడిందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్... తాజా దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని ఇజ్రాయెల్ సంప్రదించిందని.. ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే హమాస్, ఇరాన్, హూతీలు మూల్యం చెల్లించుకోకతప్పదని.. ఈ విషయాన్ని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారని వెల్లడించింది.

ఈ సందర్భంగా స్పందించిన నెతన్యాహు... తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోందని.. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిందని.. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించామని.. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేస్తోందని వెల్లడించారు.

ఈ ఘటనపై స్పందించిన హమాస్... ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా.. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని ఇల్లంఘించిందని, బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.