Begin typing your search above and press return to search.

100 ఫైటర్ జెట్లు.. వేల రాకెట్లు.. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దూకుడు..

అయితే, హెజ్బొల్లా రాకెట్లు, క్షిపణులతో తమపై పెద్దఎత్తున దాడికి సిద్ధమైందని.. దాన్ని గుర్తించి ఆత్మరక్షణ కోసమే ముందుగా దాడులు చేసినట్లు పేర్కొంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 7:43 AM GMT
100 ఫైటర్ జెట్లు.. వేల రాకెట్లు.. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దూకుడు..
X

పశ్చిమాసియా ఉద్రికత్తలు మళ్లీ రగిలాయి. గత పది రోజులుగా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండగా.. ఇజ్రాయెల్ అనూహ్యంగా జూలు విదిల్చింది. ఆదివారం తెల్లవారుజామున లెబనాన్‌ లోని హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. దాని స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించింది. కొన్ని రోజుల కిందట ఇరాన్ లో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియా, లెబనాన్ లో హెజ్బొల్లా కమాండ్ షుక్ర్ లను ఇజ్రాయెల్ హతమార్చిందనే కథనాలు వచ్చాయి. దీంతో అటు ఇరాన్, ఇటు లెబనాన్ లు హమాస్ తోడుగా ఇజ్రాయెల్ పై దాడి చేస్తామని ప్రకటించాయి. లెబనాన్ లో తాజా దాడులను ఇజ్రాయెల్, హెజ్బొల్లా రెండూ అంగీకరించాయి. అయితే, హెజ్బొల్లా రాకెట్లు, క్షిపణులతో తమపై పెద్దఎత్తున దాడికి సిద్ధమైందని.. దాన్ని గుర్తించి ఆత్మరక్షణ కోసమే ముందుగా దాడులు చేసినట్లు పేర్కొంది.

అతి భారీ దాడి.. 2 రోజుల ఎమర్జెన్సీ

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్ర సంస్థ దారుణమైన దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అంతకుమించి అతిభారీ దాడికి తాజాగా హెజ్‌బొల్లా సిద్ధమైందని.. దీంతో 100 ఫైటర్‌ జెట్ లు లెబనాన్‌ లోకి చొచ్చుకెళ్లి వేల రాకెట్‌ లాంచర్లను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చామని చెప్పారు. ఇజ్రాయెల్ లో 48 గంటల ఎమర్జెన్సీ విధించారు. ఆ దేశ దాడుల్లో తమ పౌరుడు ఒకరు చనిపోయాడని లెబనాన్‌ తెలిపింది. హెజ్‌బొల్లా 6 వేల రాకెట్లతో దాడికి సిద్ధమైంద అనేది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపణ. అక్టోబరు 7న హమాస్‌ 5 వేల రాకెట్లతోనే దాడి చేసింది.

అనుకున్నట్లే..

ఇజ్రాయెల్ లోని పౌర నివాసాల పైకి కూడా త్వరలో రాకెట్లు, క్షిపణులతో హెజ్బొల్ల దాడి చేస్తుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. ఇది చివరకు లెబనాన్‌ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని వాదన వినిపించింది. హెజ్‌బొల్లా తుంద స్థావరాల సమీపంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్న హెచ్చరిక వెలువడిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్‌ లో సైరన్లు మోగాయి. హెజ్‌బొల్లా దాదాపు 6 వేల రాకెట్లు, డ్రోన్లతో దాడికి సిద్ధమైందని చెబుతున్నారు. కాగా, 200 హెజ్‌బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 320 డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడి చేసినట్లు సమాచారం. బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది.

హెజ్బొల్లా కదిలేలోపే..

కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ పై డ్రోన్లతో దాడులు చేస్తున్నాయని హెజ్‌బొల్లా ఆదివారం ఉదయం ప్రకటించింది. సైనిక స్థావరాలు సహా ఇజ్రాయె ఐరన్‌ డోమ్‌ లే లక్ష్యం అని పేర్కొంది. తొలి విడత దాడి కూడా చేసినట్లు తెలిపింది. కానీ.. దీనికంటే తీవ్రంగా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. అక్టోబరు నుంచి హమాస్‌ తో పోరాడుతోంది ఇజ్రాయెల్. అయితే, హెజ్‌బొల్లా మాత్రం అప్పుడప్పుడే దాడులకు దిగింది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది.