Begin typing your search above and press return to search.

గాజా వెళ్లి డోరు కొడుతున్న ఇజ్రాయేల్... వీడియో వైరల్‌!

హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సైనికులు హమాస్‌ తో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలిపే వీడియోను ఇజ్రాయెల్‌ ఫ్రంట్‌ ఫోర్స్ (ఐ.ఎఫ్.ఎఫ్) తమ ట్విటర్‌ లో షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:23 AM GMT
గాజా వెళ్లి డోరు కొడుతున్న ఇజ్రాయేల్... వీడియో వైరల్‌!
X

ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధం రోజు రోజుకీ మరింత భయంకరంగా మారుతోంది. ఇందులో భాగంగా ఇజ్రాయేల్ ప్రతిదాడి విషయంలో పీక్స్ కి వెళ్తుంది. ఈ క్రమంలో ఇకపై పదాతి దళాలు సన్నద్ధం అయ్యాయి. హమాస్ ముష్కరులే లక్ష్యంగా గాజాను జల్లెడ పట్టడమే పరమావధిగా ముందుకు కదులుతున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయేల్ సైన్యం తీసుకున్న డేరింగ్ స్టెప్, గాజాలో వారు కదంతొక్కిన విధానానికి సంబంధించిన తాజా వీడియో వైరల్ అవుతోంది.

తమ దేశంలో హమాస్‌ మిలిటెంట్లు సృష్టించిన మారణకాండకు ప్రతిగా గాజాపై విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్‌ సైన్యం.. ఈ దాడులను మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడాలని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయబోతుందనే సంకేతాలు వచ్చేసినట్లే అని అంటున్నారు.

ఇందులో భాగంగా సామాన్య ప్రజానికానికి సూచనలతో కూడిన హెచ్చరికలు చేసిన ఐడీఎఫ్... “24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి.. ఉత్తర గాజాను ఖాళీచేసి తక్షణమే దక్షిణ ప్రాంతానికి తరలిపొండి.. మిమ్మల్ని కవచాలుగా వాడుకోవాలని హమాస్‌ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.. వారి నుంచి దూరంగా వెళ్లండి..” అని తన ప్రకటనలో వెల్లడించింది.

ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటికే 1,500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సైనికులు హమాస్‌ తో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలిపే వీడియోను ఇజ్రాయెల్‌ ఫ్రంట్‌ ఫోర్స్ (ఐ.ఎఫ్.ఎఫ్) తమ ట్విటర్‌ లో షేర్‌ చేసింది.

ఈ వీడియోలో... ఐడీఎఫ్‌ దళాలు హమాస్ ఉగ్రవాదులు దాగి ఉన్న గదుల్లోకి తూటాల వర్షం కురిపించాయి. అనంతరం వారిని బయటకు రప్పించేందుకు గ్రనేడ్‌ తో దాడి చేశాయి. “దొరికినవారిని తురుముదాం.. దొరకని వారిని తరుముదాం” అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ దాడిలో పాల్గొన్న ఓ ఇజ్రాయెల్‌ సైనికుడి బాడీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా ఈ వీడియోను షేర్ చేస్తూ... "శనివారం ఇజ్రాయెల్‌ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు.. సుమారు 250 మందిని బందీలుగా చేసుకొంది. అనంతరం వారిని గాజా సరిహద్దుల్లో బంధించిందని తెలిసింది. ఈ సమాచారంతో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు, హమాస్‌ మిలిటెంట్‌ స్థావరాలపై దాడి చేసి.. బందీలను సురక్షితంగా విడిపించాయి. ఈ దాడిలో 60 మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్ మట్టుబెట్టింది" అని తెలిపింది.

ఇదే సమయంలో హమాస్‌ దక్షిణ నేవీ కమాండర్ మహమ్మద్‌ అబు అలీని ఇజ్రాయేల్ దళాలు అదుపులోకి తీసుకున్నాయని సోషల్ మీడియాలో తెలిపింది. మరింత మంది బందీలను హమాస్ మిలిటెంట్లు టన్నెళ్లలో బంధించినట్లు సమాచారం అందండంతో... వారిని విడిపించడం కోసం ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌ కు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగానే 24 గంటల్లో ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడీఎఫ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటన అనంతరం ఇజ్రాయెల్‌ దళాలు గ్రౌండ్‌ ఆపరేషన్‌ మొదలుపెడితే.. గాజాలోని ప్రతి ఇంటికి వెళ్లి హమాస్‌ మిలిటెంట్లు వెతికి మరీ మట్టుబెడతాయని అంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా టన్నెల్లో ఉన్న వారిని విడిపించడం కత్తిమీద సామని అంటున్నారు.