Begin typing your search above and press return to search.

ప్రాణనష్ట వివరాలు చెబుతున్న పాలస్తీనా... ఊహించని స్కెచ్ వేసిన ఇజ్రాయేల్!

ఇందులో భాగంగా ఇప్పటివరకూ 1,417 మంది మృతి చెందారని, వారిలో 447 మంది చిన్నారులు ఉన్నారని చెబుతుంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:00 AM GMT
ప్రాణనష్ట వివరాలు చెబుతున్న పాలస్తీనా... ఊహించని స్కెచ్  వేసిన ఇజ్రాయేల్!
X

ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ పై రాకెట్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కేవలం 20 నిమిషాల్లో సుమారు 5000 రాకెట్లను ఇజ్రాయేల్ పై ప్రయోగించి భయానక వాతావరణాన్ని సృష్టించారు హమాస్ ముష్కరులు. ఈ సందర్భంగా చావుకేకలు పెడుతుంది పాలస్తీనా!

అవును... ఒకసారి యుద్ధానికంటూ దిగిన తర్వాత అన్నింటికీ సిద్ధపడాలని అంటారు. ఈ సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ పై దాడికి దిగారు. గాజా ప్రాంతంలో ఇజ్రాయేల్ తలచుకుంటే ఆహారం, ఇందనం, విద్యుత్ కూడా అందదని తెలిసినా మొండిగా రంగంలోకి దిగింది హమాస్. ఈ ఊహించని సంఘటననుంచి తేరుకున్న ఇజ్రాయేల్ ప్రతిదాడి తీవ్రంగా చేస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే గాజా ను అష్టదిగ్భందనం చేసింది. ఫలితంగా ఆ ప్రాంతానికి ఇందనం, ఆహారం, విద్యుత్ ని నిలిపేసింది. ఫలితంగా గాజాలో ఆకలి చావులు తప్పేలా లేవని ఐకాస ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోపక్క గాజాలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి షిఫా.. శవాలకు పార్కింగ్ ప్లేస్ గా మారిందనే కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో జరిగిన మరణాలపై పాలస్తీనా మొత్తుకుంటుంది. ఇజ్రాయేల్ దాడి సందర్భంగా తమ ప్రాంతంలో జరిగిన ప్రాణ నష్టాన్ని ప్రపంచానికి చెప్పుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 1,417 మంది మృతి చెందారని, వారిలో 447 మంది చిన్నారులు ఉన్నారని చెబుతుంది.

ఇదే సమయంలో ఇజ్రాయేల్ సైన్యం జరుపుతున్న దాడుల్లో 6,268 మంది గాయపడినట్లు చెబుతున్న పాలస్తీనా... ఈ దాడుల వల్ల 3,38,000 మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు హమాస్ దాడుల కారణంగా సుమారు 1,300 మంది మృతి చెందారని ఇజ్రాయేల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ సంగతి అలా ఉంటే... హమాస్ ఉగ్రవాదులను సమూలంగా ఏరి పారేస్తామని... యుద్ధం వారు మొదలుపెట్టినా, ముగించేది మాత్రం తామేనని ఇజ్రాయేల్ ప్రధాని ప్రకటించారు. కొన్ని దశాబ్ధాల పాటు ఇజ్రాయేల్ శత్రువులకు ఈ యుద్ధం గుర్తుండిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా... హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై ఇప్పటివరకూ వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది.

ఈ క్రమంలో... గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు ఇజ్రాయేల్ మిలటరీ అధికారులు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న హమాస్ మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనికోసం సుమారు 3.60 లక్షల మంది రిజర్వ్‌ సైనికులను ఇజ్రాయెల్‌ సిద్ధం చేసిందని తెలుస్తుంది.