సొరంగాల కోసం ఇజ్రాయేల్ సరికొత్త ప్రయోగం... తెరపైకి స్పాంజ్ బాంబు!
వాటిల్లోకి దిగితే.. ఎక్కడ మొదలై, ఎక్కడకు వెళ్తున్నామో తెలియదని చెబుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు అడుగు ముందుకేసినా.. హమాస్ ఉచ్చులో చిక్కుకుపోతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 28 Oct 2023 5:12 AM GMTఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న భీకరపోరు కాస్తా... గాజాపై ఇజ్రాయేల్ దాడిలా మారిపోయిన సంగతి తెలిసిందే. దాడి మొదలుపెట్టిన హమాస్.. ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి బందీలను అడ్డుపెట్టుకుని నెట్టుకొస్తున్న పరిస్థితి. ఈ సమయంలో అత్యంత కీలక నెట్ వర్క్ గా చెబుతున్న గాజా సొరంగాలపై ఇజ్రాయేల్ దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఇప్పుడు వీటీకోసం స్పాంజ్ బాంబులను ఉపయోగిస్తుంది.
అవును... గాజా భూగర్భంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర సొరంగాలున్న సంగతి తెలిసిందే. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ ప్రజలను బందించి ఆ టన్నెల్స్ లోనే ఉంచారని అంటున్నారు. ఈసమయంలో భుతల దాడుల ద్వారా వారిని విడిపించేందుకు ఇజ్రాయేల్ సైన్యం సిద్ధమవుతోంది. అయితే... ఈ టన్నెల్ నెట్ వర్క్ ను ఛేదించడం అంత సులువు కాదని.. లోపలికి వెళ్తే బయటకు రావడం అంత ఈజీకాదని నిపుణులు చెబుతున్నారు.
వాటిల్లోకి దిగితే.. ఎక్కడ మొదలై, ఎక్కడకు వెళ్తున్నామో తెలియదని చెబుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దళాలు అడుగు ముందుకేసినా.. హమాస్ ఉచ్చులో చిక్కుకుపోతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సొరంగాలను నాశనం చేయడానికి "స్పాంజ్ బాంబ్" అనే అనూహ్యమైన ఆయుధాన్ని ఇజ్రాయెల్ వాడే అవకాశాలున్నాయని ఆంగ్లపత్రిక "ది టెలిగ్రాఫ్" పేర్కొంది. దీంతో... ఏమిటీ స్పాంజ్ బాంబు.. ఇది ఎలా పనిచేసుందనేది ఆసక్తిగా మారింది.
ఏమిటీ స్పాంజ్ బాంబ్... ఎలా పనిచేస్తుంది?:
రెండు ప్రత్యేకమైన రసాయనాలుండే ఓ ప్లాస్టిక్ కంటైనరే ఈ స్పాంజ్ బాంబు. ఈ రెండు కెమికల్స్ కలవకుండా కంటైనర్ మధ్యలో లోహంతో చేసిన రేకు సీల్ అడ్డంగా ఉంటుంది. అయితే... ఇజ్రాయెల్ దళాలు హమాస్ సొరంగాలను గుర్తించిన వెంటనే ఈ సీల్ తొలగిస్తాయి. అనంతరం ఆ కంటెయినర్ ను సొరంగంలో పడేస్తాయి. దీంతోఆ కంటేనర్ లో ఉన్న రెండు రసాయనాలు కలిసి క్షణాల్లోనే భారీగా నురగ విడుదలవుతుంది.
అనంతరం ఇది అత్యంత వేగంగా గడ్డకట్టి.. సొరంగం మూతపడిపోతుంది. ఈ ఆయుధాన్ని ఇప్పటికే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు 2021లో తొలిసారి గాజా సరిహద్దుల్లోని జేఎలిం ఆర్మీబేస్ లో పరీక్షించాయని చెబుతున్నారు. దీనిని వాడే సమయంలో అప్రమత్తంగా లేకపోతే.. దళాల కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీంతో.. తీసుకోవాల్సిన సేప్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని... ఐడీఎఫ్ రంగంలోకి దిగుతున్నాయని చర్చ జరుగుతుంది.
కాగా... ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ మూడు వారాలు గడుస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్లతో మెరుపు దాడి చేసి, అనంతరం ఆదేశంలోకి చొరబడి అక్కడి ప్రజలను విచక్షణారహితంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో సుమారు 1400 మంది మరణించగా.. 200 మందికిపైగా ప్రజలను బందీలుగా తీసుకుని గాజాలోకి వెళ్లారు.
నాటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. ఇప్పుడు బందీలను విడిపించేందుకు భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 7000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారని చెబుతున్నారు.