Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి నోట కూడా ‘రాహుల్’జపమేనా?

ఈనేపథ్యంలో ప్రజాపాలన పేరిట పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 11:50 AM GMT
రేవంత్ రెడ్డి నోట కూడా ‘రాహుల్’జపమేనా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒకో అడుగు ముందుకు వేస్తున్నారు. పాలనను గాడిలో పెట్టేందుకు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజాపాలన పేరిట పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే పరిపాలనలో తనదైన మార్కు చూపించాలని ప్రయత్నిస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ మేరకు ప్రజాపాలన లోగో ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు.

వారు అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. రైతు బంధు, సంక్షేమ పథకాలు, గవర్నర్ తో సంబంధాలు తదితర అంశాలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. పరిపాలనలో ఎలాంటి వైఖరి అవలంభిస్తున్నారని అడగ్గా లంకె బిందెలు దొరుకుతాయని వస్తే మట్టి పెంకలే దొరుకుతున్నాయి. సర్దుకోవాలి. పరిపాలనను గాడిలో పెట్టాలి. ఆదాయ మార్గాలు కూడా చూసుకోవాలంటూ తన భాషలోనే జవాబు చెప్పారు.

గమ్మత్తైన విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ ప్రశ్నలు వేసేవాడు. ఇప్పుడు కూడా అతనే ప్రశ్నలు అడుగుతుంటే అందరు నవ్వుకున్నారు. కేసీఆర్ ఏమయ్యా రాహుల్ అంటూ వ్యంగ్యంగా పలికినా రేవంత్ రెడ్డి మాత్రం మర్యాదపూర్వకంగానే సంబోధించడం కొసమెరుపు. దీంతో విలేకరులు ఆశ్చర్యంగా చూసినా వారు అనుకున్న సమాధానాలు మాత్రం రాబట్టుకోవడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాళ్లు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం. ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమిస్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు గ్యారంటీల అమలు చేయడానికి వెనకకు వెళ్లం. ముందుకు నడుస్తాం. ప్రజలకు ఇబ్బందులులేకుండా చూస్తామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టింది. వాటిని ప్రతి పైసా లెక్కల్లోకి తీసుకొస్తాం. వారు చేసిన అవినీతిని నిరూపిస్తాం. ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తాం. అవినీతి ఏ రూపంలో ఉన్నా దాన్ని వదిలిపెట్టం. వారు చేసిన అవినీతి బాగోతాన్ని బయటపెట్టి మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.