నింగిలో ఇస్రో చేస్తున్న అద్భుతం గురించి తెలుసుకోవాల్సిందే
జంట ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానం చేసే ఈ ప్రయోగాన్ని పీఎస్ఎల్ వీ - సి60 రాకెట్ ద్వారా ఈ రోజు రాత్రి నింగిలోకి పంపనున్నారు.దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.
By: Tupaki Desk | 30 Dec 2024 4:31 AM GMTపరిమిత వనరులు.. అంతకు మించిన పరిమితమైన బడ్జెట్ల మధ్య అద్భుత విజయాల్ని సొంతం చేసుకునే సంస్థగా ఇస్రోను చెప్పొచ్చు. భారత కీర్తి పతాకాన్ని ఎప్పటికప్పుడు నింగిలో సగర్వంగా ఎగిరేలా చేయటంలో బిజీగా ఉండే ఇస్రో.. ఈ రోజు (సోమవారం) మరో అద్భుతానికి తెర తీసిందని చెప్పాలి. తాజాగా రెండు ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనుంది. ఉపగ్రహాల్ని పంపటం ఇస్రోకు పెద్ద విషయమా? అనుకోవచ్చు. కానీ.. తాజాగా చేపట్టిన ప్రయోగం మాత్రం రోటీన్ కు భిన్నమైనది.. భవిష్యత్తు అవసరాలకు వేసే మొదటి అడుగ్గా చెప్పాలి. అంతరిక్షంలో సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పడుతున్న తొలి ప్రయత్నంగా తాజా ప్రయోగాన్ని చెప్పాలి.
ఎంత పెద్ద నిర్మాణమైనా మొదలయ్యేది మొదటి ఇటుకతోనే. ఒక ఇటుక తర్వాత మరో ఇటుకను పేర్చుకుంటూ వెళ్లటం తెలిసిందే. ఇదే పనిని భూమికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో.. అది కూడా వెంట్రుక వాసి తేడా లేకుండా రాకుండా చేయటం ఎంత క్లిష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంక్లిష్టతకు అక్షర రూపంలో చెప్పాల్సి వస్తే.. దాన్ని డాకింగ్ గా పిలుస్తారు. రోదసి పరిశోధనల్లో తదుపరి అధ్యాయంలోకి అడుగు పెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్) పేరుతో రెండు ఉపగ్రహాల్ని ప్రయోగించనుంది. జంట ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానం చేసే ఈ ప్రయోగాన్ని పీఎస్ఎల్ వీ - సి60 రాకెట్ ద్వారా ఈ రోజు రాత్రి నింగిలోకి పంపనున్నారు.దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. డాకింగ్ సత్తా కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇంతకూ ఈ డాకింగ్ ప్రక్రియ ఏంటి? ఇందులో ఉన్న సంక్లిష్టత ఏమిటి? అన్నది సింఫుల్ గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. రోదసిలో రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావటాన్ని డాకింగ్ అంటారు. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు.. తమ వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం దగ్గర అవుతూ.. కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. ఈ రెండు వ్యోమనౌకలు ఢీ కొని పేలిపోతాయి.
ఇంతకీ ఈ ప్రయోగం ఎందుకుంటే.. అంతరిక్షంలో భారీ నిర్మాణాలకు అవసరమైన అచ్చులను (అక్రతులు) ఒకేసారి రాకెట్ లో తరలించటం కష్టం. దఫదఫాల వారీగా విడి భాగాల్ని కక్ష్యలో చేర్చి.. డాకింగ్ ద్వారా ఒకదానితో మరొకటి అనుసంధానం అయ్యేలా చేయాలి. ఇప్పుడునన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్నీ ఇలానే నిర్మించారు. ఈ కేంద్రాలకు వ్యోమగాములు.. సరకుల్ని తరలించే వ్యోమనౌకలు కూడా ఈ డాకింగ్ ద్వారానే అనుసంధానం కావాలి. భారతదేశం తాను సొంతంగా నిర్మించాలని భావిస్తున్న అంతరిక్ష కేంద్రాన్ని ఇలానే నిర్మించాలి.
ఇందులో భాగంగానే తాజాగా చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం. అంతేకాదు.. భారత్ చేయనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు కూడా ఇది సాయం చేస్తుంది. చంద్రయాన్ 4 ద్వారా చందమామ ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యాన్ని సాకారం చేయాలన్నా.. దీని అవసరముంది. కక్ష్యలో ఉన్న శాటిలైట్లకు రిపేర్లు చేయాల్సి రావటం.. వాటికి ఫ్యూయల్ నింపాల్సి వస్తే.. ఈ డాకింగ్ వ్యవస్థ సాయం చేస్తుంది. దీంతో.. శాటిలైట్లకు లైఫ్ పెరుగుతుంది.
తాజాగా ప్రయోగిస్తున్న రెండు ఉపగ్రహాలను ఛేజర్ ఉపగ్రహంగా.. టార్గెట్ ఉపగ్రహంగా పిలుస్తున్నారు. ఒక్కోదాని బరువు 220 కేజీలు. ఈ రెండు శాటిలైట్లను వేర్వేరుగా ప్రయోగిస్తారు. కాకుంటే ఒకే వాహననౌకలో ఇవి పయనిస్తాయి. భూమికి 470 కిలోమీటరల దూరంలోని వ్రత్తాకార కక్ష్యలో ప్రవేశ పెట్టిన తర్వాత వీటి వేగంలో కొంత తేడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో కక్ష్యలో తిరిగేటప్పుడు రెండింటి మధ్య దూరం పెరగటం మొదలవుతుంది. రెండు శాటిలైట్ల మధ్య దూరం 20కిలోమీటర్లకు చేరుకున్న తర్వాత.. వాటి మధ్య దూరం ఆగిపోయేలా చేస్తారు.
ప్రయోగించిన ఐదో రోజు నుంచి రెండు ఉపగ్రహాలను దగ్గరకు తీసుకురావటం మొదలు పెడతారు. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ శాటిలైట్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా ఒకదానితో మరొకటి సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ కోఆర్డినేషన్ తో వ్యవహరిస్తాయి. మొదట టార్గెట్ శాటిలైట్ తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ తర్వాత ఛేజర్ ఉపగ్రహం దాన్ని అందుకోవటానికి సిద్ధమవుతుంది. మధ్యమధ్యలో వేగాన్ని తగ్గించుకొని పరిస్థితిని ఒకసారి సరి చూసుకుంటుంది. ఆ తర్వాత ముందుకు సాగుతుంది.
రెండింటి మధ్య దూరం బాగా తగ్గిన సమయాల్లో ముందస్తు జాగ్రత్తలో భాడంగా హోల్డ్ పాయింట్ లోకి వెళతాయి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక శాటిలైట్ లోని హోల్డింగ్ హ్యాండ్స్.. రెండో శాటిలైట్ ను క్లిప్ లా పట్టి ఉంచేలా చేస్తాయి. దీంతో వాటి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అయ్యేలా చేస్తాయి. దీంతో డాకింగ్ పూర్తి అవుతుంది. చివరకు రెండు శాటిలైట్ల మధ్య దూరం 750 మిల్లీ మీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాతి దశలో రెండు ఉపగ్రహాలు ఒకే వ్యవస్థగా మారతాయి. ఒక శాటిలైట్ లోని నియంత్రణ వ్యవస్థల ద్వారా రెండింటినీ నియంత్రిస్తారు.
డాకింగ్ కు సంబంధించిన ప్రయోగాలు పూర్తి అయిన తర్వాత రెండు శాటిలైట్లు విడిపోతాయి. దీన్ని ఆన్ డాకింగ్ అంటారు. ఆ తర్వాత ఇవి రెండు సాధారణ ఉపగ్రహాల మాదిరి వేర్వేరు అంతరిక్ష పరిశీలనను చేపడతాయి. అదే సమయంలో ఈ రెండు ఉపగ్రహాలను మరోసారి డాకింగ్ కు ఇస్రో ప్రయత్నించే వీలుంది. ఇవి రెండేళ్ల పాటు పని చేస్తాయి. డాకింగ్ చేపట్టే వేళలో సూర్యకిరణాలు సరైన దిశలో పడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు జనవరి 4 నుంచి 10 రోజుల పాటు డాకింగ్ కు అనువైన టైంగా అంచనా వేశారు. ఇప్పటివరకు డాకింగ్ సాంకేతికత ఉన్న దేశాలుగా అమెరికా.. రష్యా..చైనాలు ఉన్నాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భారతదేశం నాలుగో దేశంగా అవతరిస్తుంది.