Begin typing your search above and press return to search.

ఆలయాల్లోకి యువత రావాలంటే... ఇస్రో ఛైర్మన్ ఆసక్తికర సలహా!

అవును... దేవాలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం వల్ల యువతను ఆకర్షించవచ్చని అంటున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.

By:  Tupaki Desk   |   18 May 2024 5:30 PM GMT
ఆలయాల్లోకి యువత రావాలంటే...  ఇస్రో ఛైర్మన్  ఆసక్తికర సలహా!
X

ఆలయాలంటే కేవలం వృద్దులకే కాదని.. ప్రధానంగా యువతకూడా ఆలయాల్లోకి రావాలని చెబుతూ.. అందుకు ఆలయాల్లో చేయాల్సిన పనులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్! శనివారం తన సొంత రాష్ట్రం కేరళలో తనకు అవార్డ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అవును... దేవాలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం వల్ల యువతను ఆకర్షించవచ్చని అంటున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. తాజాగా తిరువనంతపురంలోని ఉదియన్నూర్ దేవి ఆలయం నుంచి శనివారం అవార్డు అందుకున్న సోమనాథన్... ఈ సందర్భంగా మాట్లాడారు. ఇందులో భాగంగా... దేవాలయాలు కేవలం వృద్ధుల‌కేనా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా... ఆలయాలు దైవనామ స్మరణ ప్రదేశాలే కాకుండా సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలి అని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల నిర్వాహకులు యువతను ఆకర్షించేందుకు సరికొత్త కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగానే దేవాలయాల్లో గ్రంథాలయాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?.. అంటూ సోమనాథ్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో... దేవాలయాల్లో లైబ్రరీల ఏర్పాటు వంటి ప్రయత్నం వల్ల చదవగలిగే యువత దేవాలయాల వైపు ఆకర్షితులవుతారు.. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చించి కెరీర్‌ ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది.. ఈ దిశగా ఆలయ నిర్వాహకులు కార్యచరణ మొదలుపెడితే.. అది మంచి మార్పులకు సహకరిస్తుందని ఇస్రో ఛీప్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా... సైన్స్, ఆధ్యాత్మికత మధ్య ఉన్న సంబంధంపై తన దృక్పథాన్ని వెల్లడించిన ఆయన... తానొక అన్వేషకుడిని అని.. ఇందులో భాగంగా అటు చంద్రుడిని, ఇటు అంతరంగిక నమ్మకాన్ని కూడా అన్వేషిస్తానని తెలిపారు. అందువల్లే... సైన్స్, ఆధ్యాత్మికత రెంటినీ అన్వేషించడం తన జీవితంలో ఒక భాగమని తెలిపారు. అందుకే తాను బయట సైన్స్ చదువుతూ.. అంతర్గత అన్వేషణ కోసం దేవాలయాలకు వస్తానని చెప్పారు.