Begin typing your search above and press return to search.

దడపుట్టిస్తున్న ఇస్రో చీఫ్ హెచ్చరికలు !

మన జీవితకాలం 70 - 80 ఏళ్లే. కాబట్టి మనం విపత్తులను చూడకపోవచ్చు. అందుకే గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తాం

By:  Tupaki Desk   |   5 July 2024 10:30 AM GMT
దడపుట్టిస్తున్న ఇస్రో చీఫ్ హెచ్చరికలు !
X

‘’మన జీవితకాలం 70 - 80 ఏళ్లే. కాబట్టి మనం విపత్తులను చూడకపోవచ్చు. అందుకే గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తరచూ భూమిని గ్రహశకలాలు ఢీకొడుతుంటాయి. జూపిటర్ గ్రహాన్ని ఓ గ్రహశకలం ఢీకొట్టడాన్ని నేను కళ్లారా చూశాను. అలాంటిదే భూమ్మీద జరిగితే మనందరం అంతరించిపోతాం. ఇవన్నీ కచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. పుడమి తల్లిని ఇలాంటి విపత్తు నుంచి రక్షించాలి. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే మార్గం ఉంది. భూమికి సమీపంగా ఉన్న గ్రహశకలాలను ముందుగా గుర్తించి ప్రమాదం నివారించొచ్చు. అయితే, ఒక్కోసారి ఇలా చేయడం సాధ్యపడకపోవచ్చు. కాబట్టి, ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి. భారీ వ్యోమనౌకలతో ఢీకొట్టించి గ్రహశకలాలను భూమ్మీద పడకుండా దారి మళ్లించాలి. ఇందు కోసం ప్రపంచదేశాలు ఉమ్మడిగా విధి విధానాలు రూపొందించాలి’’ అని ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పిన మాటలు గుబులు రేపుతున్నాయి. ప్రపంచ గ్రహశకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో ఓ వర్క్ షాపు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్రహ శకలాలు భూమ్మీద పడితే మానవాళితో పాటు భూమ్మీదున్న అధిక శాతం జీవరాశి అంతమైపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రహశకలాలు భూమ్మీద పడకుండా భవిష్యత్తులో ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని తెలిపారు.

ప్రమాదం తప్పదన్న సమయంలో మానవాళి మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాద నివారణకు నడుం బిగించాలని, అంతరిక్ష రంగంలో ముందుడుగేస్తున్న ఇస్రో ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమం కోసం రాబోయే విపత్తును నివారించేందుకు అవసరమైన సాంకేతిక, ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు.