వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ కోసం ఇస్రో తాజా ప్లాన్ ఇదే!
ఈ క్రమంలో తాజాగా తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర విషయంలో వ్యోమగాముల సేఫ్టీ విషయంలో ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 5 March 2024 10:01 AM GMTభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన "చంద్రయాన్ - 3" సక్సెస్ అనంతరం ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా చంద్రయాన్ - 3 సక్సెస్ తర్వతా ఇస్రో చేపట్టే అంతరిక్ష పరిశోధనపై ప్రపంచ వ్యాప్తంగా కీలక దేశాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర విషయంలో వ్యోమగాముల సేఫ్టీ విషయంలో ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర "గగన్ యాన్"లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయాణంలో భాగంగా మూడు రోజులు అంతరిక్షంలో పర్యటించిన తర్వాత భూమి మీదకు వస్తారు. ఈ క్రమంలో వారి సేఫ్ ల్యాండింగ్ కోసం ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యాకప్ సైట్లను గుర్తించినట్లు తెలుస్తుంది.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గగన్ యాన్ లో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు తమ పర్యటన అనంతరం భూమిపై సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 బ్యాకప్ సైట్లను గుర్తించినట్లు ఇస్రో వెల్లడించిందని తెలుస్తుంది! వాస్తవానికి ఈ గగన్ యాన్ యాత్రలో భాగంగా వ్యోమగాములతో కూడిన మాడ్యూల్ అరేబియా సముద్రంలో దిగాల్సి ఉంటుంది.
అయితే ఈ ప్రణాళిక ప్రకారమే అంతా జరిగిపోతే సరే కానీ... మిషన్ లో ఏ చిన్నపాటి తేడా వచ్చినా వందల కిలోమీటర్ల దూరంలో వారి ల్యాండింగ్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ జలాల్లో 48 బ్యాకప్ సైట్లను గుర్తించినట్లు తెలుస్తుంది. వారు సముద్రజలాల్లో ల్యాండ్ అవ్వగానే వారిని రక్షించేందుకు అక్కడ సిబ్బంది సిద్ధంగా ఉంటారు!
కాగా... ఇస్రో చేపట్టిన గగన్ యాన్ యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాములను జాతికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని పరిచయం చేసుకున్న ప్రధాని.. వారి పేర్లను వెల్లడించారు. ఇందులో భాగంగా... గ్రూప్ కెప్టెన్లు బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా లు వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లనున్నారు.