Begin typing your search above and press return to search.

త్వరలో బిగ్ సెలబ్రేషన్స్... చివరికక్ష్యలోకి చంద్రయాన్‌-3!

జాబిల్లిపై పరిశోధనలకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది

By:  Tupaki Desk   |   16 Aug 2023 8:21 AM GMT
త్వరలో బిగ్ సెలబ్రేషన్స్... చివరికక్ష్యలోకి చంద్రయాన్‌-3!
X

చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి సమయం అసన్నమైంది. జాబిల్లిపై పరిశోధనలకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. ఈ క్రమంలో తాజాగా జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది.

అవును... నిన్నటి వరకు చంద్రుడికి 177 కిలో మీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్ - 3 బుధవారం చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరానికి వెళ్లింది. ఇక ఇక జాబిల్లిపై అడుగే తరువాయి అని అంటున్నారు. ఈ క్రమంలో ఆగస్ట్ 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని నేడు మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య కావడం గమనార్హం. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కీ.మీ. లకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది.

దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ప్రి ఫైనల్ గా ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపడతారు. దీంతో... ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది.

ఈ సమయంలో అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది. ఈ శుభ గడియ కోసం కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కాగా... చంద్రయాన్‌-3 ని జులై 14న ఎల్‌.వీ.ఎం.3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు.