Begin typing your search above and press return to search.

ఆదిత్య ఎల్-1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలతో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Dec 2023 9:02 AM GMT
ఆదిత్య ఎల్-1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన!
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలతో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల చంద్రయాన్ -3ని చంద్రుడి అవతలివైపుపై విజయవతంగా సాఫ్ట్ ల్యాండ్ చేయడంతో ప్రపంచం మొత్తం ఇస్రో వైపు చూసింది. దీంతో ఇస్రో ప్రాజెక్టులపై ప్రపంచం దృష్టి సారించింది. ఈ సమయంలో ఆదిత్య ఎల్-1 గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అత్యంత ఆసక్తికర ప్రకటన చేశారు.

అవును... చంద్రయాన్-3 సక్సెస్ ఉత్సాహంలో ఉన్న ఇస్రో సెప్టెంబర్ 2న పీఎస్ఎల్వీ ఎక్స్ ఎల్ సహాయంతో ఆదిత్య ఎల్-1 మిషన్ ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్-1 ను చేపట్టారు. ఈ సమయంలో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ ఆదిత్య ఎల్-1కు సంబంధించి సోమనాథ్ కీలక అప్ డేట్ ఇచ్చారు.

ఇందులో భాగంగా... 2024 జనవరి 6వ తేదీన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ కు చేరుకుంటుందని అంచనా వేశామని సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఆదిత్య ఎల్-1 చేరుకోవాల్సిన గమ్యస్థానం భూమి నుంచి సుమారు 15లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంటుందని తెలిపారు.

ఇదే సమయంలో... ఈ వ్యోమనౌక ఎల్-1 కేంద్రంలో స్థిరపడుతుందని, అనంతరం కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపగోపడే సమాచారాన్ని ఐదేళ్ల పాటు సేకరిస్తుందని.. ఆ సమాచారం సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మనిషి జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని సోమనాథ్ తెలిపారు.

లాంగ్రాజ్ పాయింట్ అంటే ఏమిటి?

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం.. గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లాగ్రాంజ్ ద్వారా కనుగొనబడినదే లాగ్రాంజియన్ పాయింట్! ఇది భూమి యొక్క కక్ష్యలో 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమి, సూర్యుని గురుత్వాకర్షణ ఒకదానికొకటి ఢీకొనే చోటునే లాంగ్రేజ్ పాయింట్ అంటారు. ఇవి ఐదు ఉంటాయి.

తాజాగా ఇస్రో పంపిన ఆదిత్య ఎల్-1 భూమికి, సూర్యునికి మధ్య ఉన్న లగ్రాంజ్ పాయింట్-1కి వెళ్తుంది. అందుకే దీనిని ఎల్-1 అని పిలుస్తారు. ఈ క్రమంలోనే 2024 జనవరి 6న ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుందని తాజాగా సోమనాథ్ వెల్లడించారు.