చంద్రయాన్-3...రూ.700 కోట్ల ప్రాజెక్ట్ వీళ్ల చేతుల్లోనే!
జాబిల్లిపై మన వ్యోమనౌక కాలుమోపే చరిత్రాత్మక క్షణాల కోసం యావత్ భారతావని ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తోంది
By: Tupaki Desk | 23 Aug 2023 10:59 AM GMTజాబిల్లిపై మన వ్యోమనౌక కాలుమోపే చరిత్రాత్మక క్షణాల కోసం యావత్ భారతావని ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తోంది. ఈ సాయంత్రం 5:44 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 మిషన్ లో ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరించారు. ఈ కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
దాదాపు రూ.700 కోట్ల ప్రాజెక్ట్ అయిన ఈ చంద్రయాన్ -3 కోసం నాలుగేళ్లుగా పలువురు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలోనూ కఠిన పరిస్ధితుల్లో ఈ ప్రాజెక్ట్ కోసం వీరంతా పనిచేశారు. దీనికోసం సుమారు వెయ్యి మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు పనిచేసినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తాజాగా వెల్లడించారు. వారిలో కీలకమైన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వారిలో అత్యంత కీలక వ్యక్తి ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్. చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్ మార్క్-3 రూపకల్పనలో ఈయన కీలకంగా వ్యవహరించారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ల నిర్మాణం, ప్రొపల్షన్ సిస్టమ్ డిజైన్, డైనమిక్స్ డిజైన్ వంటి విభాగాల్లో ఈయనకు అపార అనుభవం ఉంది.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ విద్యార్థి అయిన ఈయన... 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకముందు వరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
ఈయన తర్వాత కీలకమైన వ్యక్తుల్లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ వీరముత్తువేల్ ఒకరు! 2019లో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఈయన... చంద్రయాన్-2 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వనితా ఆధ్వర్యంలోనూ పనిచేశారు. అంతక ముందు బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉన్న స్పేస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు.
అనంతరం చంద్రయాన్-3 డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె కల్పన కీలక వ్యక్తుల్లో మరొకరు. చెన్నైలో బీటెక్ పూర్తయిన వెంటనే ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరిన కల్పన... తొలుత శ్రీహరికోటలో ఐదేళ్లపాటు విధులు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రానికెళ్లి అక్కడ విధులు నిర్వహించారు.
ఇప్పటికే ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్న ఈమె... చంద్రయాన్-2 ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా చంద్రయాన్-3 ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదే క్రమంలో... కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి.ఎస్.ఎస్.సి.) డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్.. ఈ చంద్రయ్యాన్ - 3 లో మరో కీలకమైన వ్యక్తి. ప్రస్తుతం చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్.ఎమ్.వీ-3ని వి.ఎస్.ఎస్.సి. లోనే నిర్మించారు.
ఇక, యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (యూ.ఆర్.ఎస్.సి) డైరెక్టర్ గా ఉన్న ఎం శంకరన్ ఈ ప్రాజెక్టులో మరో కీలక వ్యక్తి. ఉపగ్రహాలకు అవసరమైన పవర్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఈయనను "ఇస్రో పవర్ హౌస్" గా పరిగణిస్తారు.
ఫిజిక్స్ లో పట్టభద్రుడైన శంకరన్.. చంద్రయాన్-3 మిషన్ లో కీలకమైన ల్యాండర్ శక్తిని పరీక్షించేందుకు అసవరమైన చంద్రుడి ఉపరితలాన్ని పోలిన నిర్మాణాన్ని భూమిపై రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్ స్ లో కూడా పనిచేశారు.
ఇదే సమయంలో తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్.పి.ఎస్.సి) డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న వి నారాయణన్ మరో కీలకమైన వ్యక్తి. చంద్రయాన్-3 లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కు అవసరమైన థ్రస్టర్లను అభివృద్ధి చేసిన టీం కు ఈయనే నాయకుడు. ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి అయిన నారాయణన్... క్రయోజెనిక్ ఇంజిన్స్ నిర్మాణంలో నిపుణుడు.
ఈ సమయంలో మరో అత్యంత కీలమైన వ్యక్తి బీఎన్ రామకృష్ణ. ఈయన బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ సెంటర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. "17 మినిట్స్ టెర్రర్ టైం"గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ప్రక్రియను ఈయన ఆధ్వర్యంలోనే పర్యవేక్షిస్తారు!