షర్మిల ఒంటరి అయ్యారా !
కనీస గౌరవ ప్రతిపక్షంగా అయినా.. ముందుకు తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ షర్మిలపై పెట్టిన అజెండా.
By: Tupaki Desk | 29 July 2024 12:30 PM GMTపార్టీ ఒకటి.. అనుసరించే మార్గం మరొకటి. ఎందుకంటే.. రాజకీయాలు అనేవి ఎప్పుడూ కత్తిమీద సాము మాదిరిగానే ఉంటాయి . ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా కొట్టినా.. అంతే! ఇప్పుడు ఈ పరిస్థితే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయం లోనూ కనిపిస్తోంది. వినిపిస్తోంది. తనుకు పార్టీ అప్పగించిన అజెండా ఒకటైతే.. తాను ఎంచుకున్న అజెండా మరొకటి కావడం గమనార్హం. పార్టీని బలోపేతం చేయడం, వైఎస్ అభిమానులు, ఆయన పరివారంగా గుర్తింపు ఉన్న వారిని చేరదీయడం.. రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం, కనీస గౌరవ ప్రతిపక్షంగా అయినా.. ముందుకు తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ షర్మిలపై పెట్టిన అజెండా.
అందుకే పూర్తిస్థాయిలో ఆమెకు అధికారం ఇచ్చారు. ఎవరిని చేర్చుకున్నా.. ఎవరిని కాదనుకున్నా.. పార్టీ అధిష్టానం అడ్డు పెట్ట లేదు. అంతేకాదు.. తాజాగా ముగిసిన ఎన్నికల తర్వాత.. కొందరు నాయకులు షర్మిలపై విమర్శలు చేశారు. అంతేకాదు.. ఆమెపై ఆర్థిక ఆరోపణలు సహా.. నాయకత్వ లక్షణాలు కూడా లేవంటూ.. కొందరు మహిళానాయకులు కూడా పార్టీ అధిష్టానిని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయితే.. పార్టీ మాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు.. ఇలా ఫిర్యాదులు చేసిన వారిపైనే చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించింది. ఇదంతా కూడా.. షర్మిలపై అధిష్టానం పెట్టుకున్న నమ్మకం.
తమ అజెండాను ఆమె అమలు చేస్తుందన్న పెద్ద విశ్వాసం. అయితే.. షర్మిలను వ్యక్తిగతంగా చూస్తే. తాను జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న జాడను మరిచిపోయినట్టుగా ఉన్నారు. కేవలం తన సొంత అన్నను, ఆల్రెడీ ఎన్నికల్లో బలమైన ఎదురు దెబ్బతగిలి.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీ వైసీపీని టార్గెట్ చేయడం చూస్తే.. వ్యక్తిగత అజెండాకు షర్మిల ఎనలేని ప్రాధాన్యం ఇస్తన్నారు. ఈ పరిణామాన్ని.. పార్టీలో సీనియర్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం తప్పుకాదు. కానీ, వ్యక్తిగత విషయాలను కూడా చర్చకు పెట్టి విమర్శలుచేయడాన్ని సహించలేక పోతున్నారు.
ఇక,ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో ఆ కార్యక్రమాన్ని దారిమళ్లేలా చేయాలన్న వ్యూహంతో షర్మిల ఎత్తుగడ వేశారు. నేరుగా పశ్చిమ గోదావరికి పోయి.. అక్కడ వరద ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలో దిగి.. ఏవేవో అన్నారు. ఇక్కడ కూడా.. జగన్ సర్కారునే ఆమె తప్పుబట్టారు. వాస్తవానికి వైఎస్ కాలం నుంచి.. ఇంకా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచి కూడా ఎర్రకాలువ సమస్య ఉంది. దీనిని తెలుసుకోకుండా.. జగన్‌ను దోషిగా చూపించే సరికి.. అందరూ నివ్వెర పోయారు. మైండ్ ఉండే మాట్లాడిందా? అని కూడా కామెంట్లు వచ్చాయి. ఇక, పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నది వైసీపీ చేసిన వాదన. ఇది న్యాయస్థానంలో ఉంది. దీనిని అడ్డు పెట్టుకుని కూడా షర్మిల వ్యాఖ్యలు చేయడంతో సీనియర్లు ఆమె వైఖరిపై గుస్సాగా ఉన్నారు. దీంతో షర్మిల కార్యక్రమాలు బోసిపోతున్నాయి.