Begin typing your search above and press return to search.

జగన్ ని ఇండియా కూటమి వైపు నడిపిస్తున్నది ఆమేనా ?

ఒకవేళ ఏమైనా సానుభూతి ఉన్నా దానిలో వాటా కోసం చెల్లెలు షర్మిల కాచుకుని కూర్చుంది.

By:  Tupaki Desk   |   25 July 2024 4:30 PM GMT
జగన్ ని ఇండియా కూటమి వైపు నడిపిస్తున్నది ఆమేనా ?
X

వైసీపీ అధినేత జగన్ ఇపుడు ఏదో ఒకటి తేల్చుకునే పనిలో ఉన్నారు అని అంటున్నారు. ఆయన వైసీపీని పుష్కర కాలం నడిపిన తీరు వేరు. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత సీన్ వేరు అని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీది ఒంటరి పోరాటం గా ఉంది.

వైఎస్సార్ వారసత్వం అన్నది ఇపుడు ఏ మాత్రం పనిచేయదు. ఒకవేళ ఏమైనా సానుభూతి ఉన్నా దానిలో వాటా కోసం చెల్లెలు షర్మిల కాచుకుని కూర్చుంది. ఆమె పగబట్టినట్లుగా జగన్ ని రాజకీయంగా వెంబడిస్తున్నారు. ఇక జగన్ ని కట్టడి చేయడానికి టీడీపీ కూటమి అధినేత చంద్రబాబు ఎటువంటి వ్యూహాలు అయినా పన్నుతారు అన్నది తెలిసిందే. షర్మిలతో మరోసారి వైసీపీకి దెబ్బ తినిపించేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు అని అంటున్నారు.

దానికి తగినట్లుగా ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల అధికార కూటమి కంటే ఎక్కువగా జగన్ మీదనే విమర్శలు ఎక్కు పెడుతున్నారు. వరద ప్రాంతాలలో పర్యటించమని మంత్రులను కోరాలి. కానీ విపక్షంలో ఉన్న జగన్ పర్యటించలేదని ఆమె నిందలు వేశారు. తల్లికి వందనం పధకం అమలు చేయమని కూటమిని డిమాండ్ చేయాలి కానీ జగన్ అమ్మ ఒడి కింద ఒక్కరికే నగదు ఇచ్చారని ఆమె ఘాటు విమర్శలు చేశారు.

ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వంటి వారు ఒక వైపు విమర్శలు చేస్తున్నా షర్మిల మాత్రం జగన్ నే తప్పుపడుతున్నారు. వినుకొండలో దారుణ హత్యను సైతం వైసీపీ వారి మధ్య జరిగిన వివాదంగా చెబుతున్నారు. అంతవరకూ ఒకే అనుకున్నా అలా రోడ్డు మీద అందరూ చూస్తూండగా అంత దారుణం జరిగితే లా అండ్ ఆర్డర్ మీదనే కదా ఆ ప్రభావం పడుతుంది అన్నది కూడా ఆమె ఆలోచించలేదని వైసీపీ నేతలు అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ ని ముందు పెట్టుకుని వైసీపీని ఇరకాటంలో పెట్టాలని ఆ పార్టీ ఓటు షేర్ ని తగ్గించాలని నాయకులను తమ వైపునకు తిప్పుకోవాలని షర్మిల చూస్తున్నారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ఏపీలో పార్టీని బలోపేతం చేస్తామని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీలో ఉన్న కాంగ్రెస్ నేతలకు ఎర వేయడానికి కాంగ్రెస్ పెద్దలు తెర వెనక ఆత్మలు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు.

బీజేపీతో కలసి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే టీడీపీని వదిలిపెట్టి బీజేపీతో అంటకాగారు అని అంటూ వైసీపీని జగన్ నే షర్మిల విమర్శించడం వెనక వ్యూహాలు కూడా స్పష్టం. వైసీపీకి ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ గల్లంతు చేయడమే ఆమె లక్ష్యం అని అంటున్నారు. ఇలా 2024 లో విపక్షలో ఉండి అధికార పక్షంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టిన షర్మిల 2029 నాటికి విపక్షంలో ఉంటూ ఓట్ల చీలిక ద్వారా వైసీపీని మరోమారు దెబ్బ కొడతారు అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ఇపుడు ఆలోచనలో పడ్డారని అంటున్నారు. బీజేపీతో ఉన్నా వైసీపీకి లాభం ఏమీ లేదు. ఒకటికి రెండు పార్టీలుగా కూటమి కట్టిన టీడీపీ జనసేన జగన్ ని దగ్గరకు రానీయకుండా చూస్తాయి. దాంతో పాటు కేంద్రంలో ఎన్డీయేకి ప్రాణ వాయువు లాంటి మద్దతు ఇస్తున్న ఆ పార్టీలని వదిలి బీజేపీ కూడా ఏమి చేసేది ఉండదు.

పైగా బీజేపీ కూడా రాజకీయ వ్యూహాలతో ముందుకు వస్తుంది. తన రాజకీయ లాభాలనే చూసుకుంటుంది దాంతో బీజేపీతో స్నేహాల కన్నా ఇండియా కూటమి తో స్నేహమే మేలు అని జగన్ తలుస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ దేశంలో పెరిగింది. అలాగే ఇండియా కూటమి అధికారానికి దగ్గరగా వచ్చింది. తాజా ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇండియా కూటమికి ఉన్న రాజకీయ అనుకూలతను చాటి చెబుతున్నాయి.

దాంతో ఇండియా కూటమి మిత్రులతో మొదలెట్టి కాంగ్రెస్ తో స్నేహ హస్తం చాచేందుకే జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. జాతీయ పార్టీల అండ తనకు దక్కుతుంది. ఏపీలో వైసీపీ పోరాటాలకు మద్దతు ఉంటుంది. అలాగే రేపటి రోజున ఎన్డీయే ప్రభుత్వం తన మీద కేసులు పెట్టినా జాతీయ పార్టీలు అండగా నిలిచి కేంద్రాన్ని నిలదీస్తాయని భావిస్తున్నారు.

ఇక ఎన్డీయే ప్రభుత్వం ఎటూ కేసులను తిరగతోడుతుందని తనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న జగన్ వైసీపీని కాపాడుకోవడంతో పాటు 2029లో గెలవడం అన్న దాని మీదనే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ తో చేయి కలిపితే షర్మిల ని సులువుగా సైడ్ చేయవచ్చు అన్నది అసలైన వ్యూహం అని అంటున్నారు.

ఇక ఇండియా కూటమితో ఇప్పటి నుంచి స్నేహంగా ఉంటూ 2029 నాటికి పొత్తులు పెట్టుకుంటే ఏపీలో సులువుగా అధికారంలోకి రావచ్చునని ఓట్ల చీలిక సైతం ఉండదని భావిస్తున్నారుట. అంతే కాదు కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూసే వైసీపీ వారికి అడ్డుకట్ట పడుతుందని మిత్రపక్షంగా ఉంటే కాంగ్రెస్ కూడా తమ పార్టీ నేతలను తీసుకునే సాహసం చేయదని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి న్యూట్రల్ గా జాతీయ రాజకీయాల్లో ఉందామనుకుని జగన్ ఎంత ప్రయత్నం చేసినా షర్మిల రూపంలో ఆయనకు ఎదురవుతున్న ముప్పు వైసీపీ అస్తిత్వాన్నే ప్రశ్నించేలా ఉండడంతో ఇండియా కూటమి వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ కనుక చూస్తూంటే జగన్ ని ఇండియా కూటమి దిశగా సాగేలా షర్మిల ఫ్యాక్టర్ చేస్తోందా అన్నదే చర్చగా ఉంది అంటున్నారు.