బీజేపీలో ధీమా పెరిగిపోతోందా
ఇదే సమయంలో 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ప్రకటించారు.
By: Tupaki Desk | 2 Dec 2023 4:28 AM GMTఅధికారం నీదా నాదా అని బీఆర్ఎస్-కాంగ్రెస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాబోయేది తామేనంటే కాదు కాదు తామేనంటు రెండు పార్టీల నేతలు ప్రకటించేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అయితే 7వ తేదీన బీఆర్ఎస్ ఆఫీసులో కేసీయార్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ప్రకటించారు.
ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని పక్కనపెట్టేస్తే మధ్యలో బీజేపీ కూడా ధీమాగా ఉంది. కమలనాదుల్లో ఎవరిని కదిలించినా తెలంగాణా ప్రభుత్వంలో చక్రంతిప్పేది తమ పార్టీయే అని గట్టిగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చే విషయంలో పై రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయంటే ఓ అర్ధముంది. మరి బీజేపీ కూడా అలాగే ధీమాగా ఉందంటే అర్ధమేంటి ? ఏమీలేదు తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ తప్పదని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. తమకు 15 సీట్లు రావటం ఖాయమని కమలనాదులు నమ్ముతున్నారు.
బీజేపీ గెలుచుకునే సీట్లు పెరిగేకొద్దీ పై రెండు పార్టీల సీట్లు తగ్గిపోతాయన్నది అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెరో 45-50 సీట్ల మధ్య వస్తే అప్పుడు ఏ పార్టీకి అధికారంలోకి వచ్చేంత సీనుండదు. ఒకవేళ ఎంఐఎం మద్దతు తీసుకున్నా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఉండాల్సిందే తప్ప ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయలేదు. ఇక్కడే బీజేపీ పాత్ర కీలకం అవుతుందని కమలనాథులు అనుకుంటున్నారు.
ఇస్తే బీఆర్ఎస్ కు మద్దతివ్వటం లేకపోతే హంగ్ అసెంబ్లీ వచ్చిందని చెప్పి ముందు రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలున్నాయట. రాష్ట్రపతి పాలనంటే ప్రతినిధిగా గవర్నరే కీలకమవుతారు. గవర్నర్ అంటే వెనుకనుండి బీజేపీనే మొత్తం వ్యవహారాలను నడుపుతుంది. ఈ రకంగా చూసుకుంటే బీజేపీది కీలకపాత్రనే చెప్పాలి. అయితే ఇందుకు ఎంతవరకు అవకాశం ఉందన్నదే అసలైన పాయింట్ ? ఏ విషయం తేలాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయక తప్పదు కదా.