కూటమికి తొలి సెగ : కదం తొక్కుతామంటున్న వాలంటీర్లు
టీడీపీ ప్రభుత్వం పాలన అక్షరాలా రెండున్నర నెలలు మాత్రమే పూర్తి చేసుకుంది.
By: Tupaki Desk | 23 Aug 2024 1:30 AM GMTవాలంటీరే అని కరివేపాకులా తీసిపారేస్తే వారే ఉద్యమిస్తారు లక్షలుగా మారి పోరాటం చేస్తారు అని ఉరుముతున్నారు. జస్ట్ అయిదు వేల రూపాయలు గౌరవ వేతనానికి పనిచేసే వాలంటీర్లు ఇపుడు ఎంతో బలమైన తీర్పుతో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మీద సమర శంఖం పూరిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం పాలన అక్షరాలా రెండున్నర నెలలు మాత్రమే పూర్తి చేసుకుంది. అంటే హానీమూన్ పీరియడ్ సాగుతోంది అన్న మాట. అయితే వాలంటీర్లు ఆ సమయం కూడా ఇవ్వడం లేదు. ఉద్యమిస్తామని కచ్చితంగా చెప్పేస్తున్నారు.
మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆగస్టు నెలాఖరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి కీలకమైన నిర్ణయాలే తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఏపీలో వాలంటీర్లు రెండున్నర లక్షల మంది ఉన్నారు. వీరిలో రాజీనామా చేసిన వారు కూడా ఉన్నారు. అయితే అంతా ఇపుడు ఒక్కటి అవుతున్నారు.
రెండున్నర లక్షల మంది అంటే వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే పది లక్షల మంది దాకా అవుతారు. ఎన్నికల రాజకీయాలు ఓట్ల వేటలో ఇది అత్యంత బిగ్ నంబర్ గానే చూడాలి. ఇంతకీ వాలంటీర్ల బాధేమిటి ఆవేదన ఏమిటి అన్నది చూస్తే కనుక వారికి నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి కూటమి పెద్దలు ఎన్నికల్లో ప్రచారం చేశారు.
చెప్పకేమి కానీ వైసీపీ నియమించిన వాలంటీర్లు అంతా ఆ మాటలకు టర్న్ అయి కూటమి గెలుపుకే పనిచేశారు. అలా తమకు బతుకులు ఇచ్చి ఈ వ్యవస్థను సృష్టించిన వైసీపీ ఓటమికి బాటలు వేశారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ కూటమి సర్కార్ వాలంటీర్ల ఊసే తలవడం లేదు. వారి అవసరం లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తోంది.
ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీరుని నియమించించి గత వైసీపీ ప్రభుత్వం. అయితే వాలంటీర్లు అందించే పౌర సేవలలో వృద్ధులకు పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చే కార్యక్రమం హైలెట్ గా నిలిచింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పనులను సచివాలయం పర్మనెంట్ సిబ్బంది తో చేయిస్తోంది. జూలై ఆగస్టు నెలలలో ఇలాగే చేసింది.
దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ సాగుతోంది. వారికి ఏ సంగతీ చెప్పకుండా పక్కన పెట్టేశారు అని అంటున్నారు. అంతే కాదు జూన్, జూలై ఆగస్టు నెల జీతాలు కూడా ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా వీరావేశంతో కదం తొక్కుతున్నారు. మాకు ఇచ్చిన హామీ మేరకు పాత బకాయిలు చెల్లిస్తూ నెలకు పదివేల వంతుజ గౌరవ వేతనం చెల్లించాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 28న మంత్రివర్గ సమావేశం ఉంది. అందులో కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతున్నారు.
ఒక వేళ అలా తీసుకోకపోతే మాత్రం ఆగస్ట్ 31న రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటుందని ఆ మీదట తమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మరి బాబు సర్కార్ ఏమి చేస్తుందో అని అంతా చూస్తున్నారు. వాలంటీర్లే కదా అని లైట్ తీసుకుంటే మేమేంటో చూపిస్తామని అంటున్నారు. వారి విషయంలో కూటమి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.