ఏపీ ఎంపీలు నిధులు తేలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?
వీటన్నిటిపై ఏపీ ఎంపీలు పార్లమెంటు రెండు సభలలో ప్రస్తావించి రాష్ట్రం తరఫున గట్టిగా పోరాడాల్సి ఉంది.
By: Tupaki Desk | 17 Feb 2024 1:47 PM GMTపార్లమెంటులో ఆయా రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహించే లోక్ సభ, రాజ్యసభ సభ్యులు తమ రాష్ట్రాల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయడం సహజం. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయింది. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రంలోని నాటి యూపీయే ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, కేంద్ర విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థల ఏర్పాటు, తెలంగాణ–ఆంధ్రా మధ్య ఆస్తుల పంపకం.. ఇలా ఎన్నింటినో కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది.
వీటన్నిటిపై ఏపీ ఎంపీలు పార్లమెంటు రెండు సభలలో ప్రస్తావించి రాష్ట్రం తరఫున గట్టిగా పోరాడాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ఏపీ ఎంపీలు ఫెయిల్ అయ్యారని అంటున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ చాలావరకు ఇంకా పెండింగ్ లో ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంటులో ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడం లేదని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీకి ఏపీ నుంచి ఎంపీలు ఉన్నారు. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వివిధ విషయాల్లో మద్దతు ఇస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. అందువల్లే ఈ పార్టీల ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని అంటున్నారు.
అలాగే ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కాంట్రాక్టర్లు ఉన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో ఉన్నారని చెబుతున్నారు.
ఇక కేశినేని నాని, ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రఘురామకృష్ణరాజు ఇలా వీరంతా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లేనని గుర్తు చేస్తున్నారు. గతంలో టీడీపీ తరఫున ఎంపీలుగా ఎన్నికై బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ సైతం వ్యాపారవేత్తలనేని అంటున్నారు. వీరంతా తమ వ్యాపార ప్రయోజనాలనే కాపాడుకుంటున్నారు తప్ప రాష్ట్రం కోసం పోరాటం చేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకరిద్దరు ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే వారిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఉదంతం ఇందుకు నిదర్శనం. తనను, తన వ్యాపార సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యగా చేసుకున్నాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీ తన సంస్థల్లో తనిఖీలు చేశాయన్నారు. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నానని జయదేవ్ హాట్ కామెంట్స్ చేశారు.
లోక్ సభలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా తాను మాట్లాడినప్పటి నుంచి కేంద్రం తనను లక్ష్యంగా చేసుకుందని జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో కూడా ఇలాగే వేధించడంతో వేరే రాష్ట్రాల్లో తన పరిశ్రమల యూనిట్ లను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని వాదన కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రా నుంచి 25 శాతం ఎంపీలకు వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. వీరంతా తమ ఆస్తులను, వ్యాపారాలను రక్షించుకోవడానికే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారనే అంటున్నారు. అందువల్లే రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేకపోవడంతోపాటు నిధులు సాధించలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.