''ఇది పవన్ కల్యాణ్ ఖర్మ అనాలా, లేక రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనాలా?''
తాను గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.
By: Tupaki Desk | 20 March 2024 5:16 PMజనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్‌నాయకుడు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఇది పవన్ కల్యాణ్ ఖర్మ అనాలా, లేక రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనాలా?`` అని ఆయన రెచ్చిపోయారు. దీనికి కారణం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తుండడమే. తాజాగా మంగళవారం తన పోటీపై పవన్ స్పందించారు. పిఠాపురం అసెంబ్లీ స్థానంపై గట్టి నమ్మకమే పెట్టుకున్నానన్నారు. తాను గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఎమ్మెల్యే ద్వారం పూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం వెళ్లడం వెనుక పెద్ద ప్రణాళికే ఉందని అన్నారు. తన సామాజికవర్గం (కాపులు) వాళ్లు పిఠాపురంలో ఎక్కువమంది ఉన్నారని, అందుకే అక్కడి నుంచి బరిలో దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ``రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని వాడిని(పవన్) ఇప్పుడు ఇక్కడ కాపులు గెలిపిస్తారని అనుకోవడం భ్రమే. వాళ్లే పవన్ కల్యాణ్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తారు`` అని ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అన్నమాటే కానీ, ఆయన ఇతర పార్టీలకు చెందిన అధినేతల నియంత్రణలో ఉన్నారని పరోక్షంగా టీడీపీ, బీజేపీలను ఉద్దేశించి ద్వారం పూడి విమర్శించారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతి కావాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతించాలని ఎద్దేవా చేశారు. ఇది పవన్ కల్యాణ్ ఖర్మ అనాలా, లేక రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనాలా? అని వ్యాఖ్యానించారు. పవన్ పిఠాపురం నుంచే కాదు.. ఎక్కడ నుంచి పోటీ చేసినా.. తాను అక్కడ పర్యటించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. తనను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
కాగా, ద్వారం పూడి తన అనుచరులకు కొన్ని సూచనలు చేయడం గమనార్హం. ``మీరు నాకోసం ఇక్కడ(కాకినాడ సిటీ) పనిచేయడం మానేయండి. మన టార్గెట్ పిఠాపురం. అక్కడ వైసీపీని గెలిపించాలి. జగన్‌ను గెలిపించాలి. మీరు ఖర్చులకు వెనుకాడొద్దు. మీ వాళ్లకు చెప్పండి. మీరంతా చేతులు కలపండి. అక్కడకు వెళ్లండి. నా మాటగా అక్కడి వారికి చెప్పండి. పవన్‌ను ఓడించాలని చెప్పండి. ఆయన వల్ల ఈ రాష్ట్రానికే కాదు.. కాపులకు కూడా జరిగింది, ఒరిగింది ఏమీలేదు`` అని ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించడం గమనార్హం.