Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఇవి సాధ్యమేనా?

ఈ సమయంలో తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 11:54 AM GMT
చంద్రబాబుకు ఇవి సాధ్యమేనా?
X

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ చంద్రబాబు ఇప్పుడు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు మంత్రులు కూడా టీడీపీ నుంచి ఉన్నారు.

ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను, హక్కులను, వాటాలను పట్టుపట్టి తీసుకెళ్లడానికి చాలా అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. 2014 నాటి "ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం" వాగ్దానాన్ని తెరపైకి తెచ్చారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు ప్రశ్నల వర్షాలు కురిపించారు. వాస్తవానికి ఏడేళ్ల క్రితమే రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తిన జైరాం రమేష్... దురదృష్టవసాత్తు ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. ఈ సందర్భంగా... ముఖ్యమైన ఐదు విస్మృత సమస్యలపై ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టత ఇవ్వాలని తెలిపారు.

ఇదే సమయంలో... "సమస్యలను పట్టుదలతో తీసుకుంటే తప్ప, మూడోసారి మీ సోదరుడు ప్రధాని అయినప్పటికీ ఈ హామీలను నెరవేరుస్తారనే ఆశ లేదు" అని చంద్రబాబు ఉద్దేశించి అన్నారు జైరాం రమేష్!

ఇందులో ప్రధానంగా... మార్చి 2014లో పవిత్ర తిరుపతిలో వాగ్దానం చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాను అందిస్తారా? అని మోడీని ప్రశ్నించిన జైరాం రమేష్... పోలవరం బహుళార్థక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ నిధులను విడుదల చేస్తారా? అని అడిగారు. ఇదే సమయంలో... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేస్తారా? అని ప్రశ్నించారు.

అదేవిధంగా... ఆంధ్రప్రదేశ్‌ లో ప్రధాన కార్యాలయంగా ఉండాల్సిన కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ ను అమలు చేస్తారా? కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గరాజపట్నం పోర్ట్, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం సహా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు హామీలను పదేళ్లుగా కాలయాపన చేసిన వాటిని ఇప్పటికైనా ప్రధాని మంజూరు చేస్తారా? అని జైరాం రమేష్ ప్రశ్నించారు.

జైరాం రమేష్ అడిగారనో.. లేక, మరొకరు నిలదీశారనో కాదు కానీ... ఈ విషయంలో ఏపీ ప్రజలు చంద్రబాబుకు ఇచ్చిన భారీ విక్టరీకి పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ మోడీతో మాట్లాడి చేయించుకోవాల్సిన బాధ్యత అయితే కచ్చితంగా ఉందనే చెప్పాలి. మరి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి... ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను చంద్రబాబు సాధిస్తారా లేదా అనేది వేచి చూడాలి!