జగన్‌పై ఫిర్యాదులు.. బాబుకు గెయిన్ ఎంత..?
అదేసమయంలో జగన్ పాలనలో వివిధ శాఖల పరిస్థితిపై కూడా.. శ్వేత పత్రాలను కేంద్రానికి కూడా సమర్పించానని చెప్పారు.
By: Tupaki Desk | 19 July 2024 2:30 PM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై.. కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్టు స్వయంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గంటలోనే ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వైసీపీ చేసిన అకృత్యాలు, విధ్వంసాలు, దారుణాలు.. దోపిడీని కూడా కేంద్రానికి వివరించానంటూ.. ప్రకటించారు. అదేసమయంలో జగన్ పాలనలో వివిధ శాఖల పరిస్థితిపై కూడా.. శ్వేత పత్రాలను కేంద్రానికి కూడా సమర్పించానని చెప్పారు.
ఇవన్నీ.. కేంద్ర హోం శాఖ మంత్రికి స్వయంగా చంద్రబాబు వివరించారు. శ్వేతపత్రాల తాలూకు నివేది కలు కూడా ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఇది చంద్రబాబుకు వ్యక్తిగతంగా కానీ.. రాష్ట్రానికి కానీ.. ఏమేరకు మేలు చేస్తుందనేది ప్రశ్న. ఎందుకంటే.. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారం.. రాష్ట్రంలో ఖజానా జీరో అయిపోయింది. లావొక్కింతయు లేదు.. అన్నట్టుగా చంద్రబాబు కేంద్రంపైనే భారం వేసేశారు. అయితే.. దీనిని కేంద్రం ఏమేరకు సానుకూలంగా తీసుకుంటుందనేది చూడాలి.
అయితే.. ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సహజంగానే తమపై ఆధారపడుతున్నారని తెలిస్తే.. మోడీ సర్కారు సదరు రాష్ట్రంపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో జగన్ సర్కారును కూడా మోడీ ప్రభుత్వమే ఆడించింది. అడ్డమైన చట్టాలను అమలు చేయాలని.. ఆదేశించింది. అంతేకాదు.. చెత్తపై పన్నులు వేయాలని ఒత్తిడి చేసింది. రైతులు వాడే విద్యుత్‌కు మీటర్లు పెట్టాలని సూచించింది. అప్పుడు కానీ.. తాము ఆర్థికంగా మద్దతు ఇవ్వబోమని చెప్పింది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉన్న దరిమిలా.. జగన్ ఒప్పుకొన్నారు.
దీంతో ప్రజల్లో జగన్ చులకన అయిపోయారు. ఒకవైపు రూ.100 ఇస్తు.. మరో చేత్తో రూ.1000 లాగేస్తున్నారనే అపప్రదను కూడా మూటగట్టుకున్నారు. దీనికి కారణం.. రాష్ట్ర పరిస్థితిని పూసగుచ్చినట్టు వివరించి.. 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్ర ఖజానాను పూర్తిగా తుడిచి పెట్టేశారన్న విమర్శలు చేసినందుకే. ఇక, ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే బాటలో పయనిస్తే.. కేంద్రం అయితే.. ఉదారంగా సాయం చేయదు. ఎందుకంటే.. ఒక రాష్ట్రానికి ఉదారంగా సాయం చేస్తే.. మరో రాష్ట్రం అడుగుతుంది. సో.. ఇప్పుడు కూడా.. నెత్తిన ఎక్కే అవకాశం ఉంటుంది. దీనిని ఆలోచించుకుని చంద్రబాబు అడుగులు వేయాలని అంటున్నారు పరిశీలకులు.