Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు అసలు పరీక్ష ఇప్పుడేనా?

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:58 AM GMT
రేవంత్‌ కు అసలు పరీక్ష ఇప్పుడేనా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు. ఎక్కడా తొట్రుపాటు లేకుండా ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్టు ఆయన పరిపాలన సజావుగా సాగిపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించారు.

కాగా అసలు సిసలు పరీక్ష రేవంత్‌ కు ఈ సంక్రాంతి పండుగ లోపు రాబోయే ఈ కొద్ది రోజుల్లో ఎదురుకానుందని అంటున్నారు. సంక్రాంతిలోపు రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేకపోయినవారికి, పార్టీకి అంకితభావంతో పనిచేసేవారికి నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు.

ఈ మేరకు జనవరి 3న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ పదవుల అంశంపై చర్చిస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి పదవుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా లాబీయింగ్‌ మొదలుపెట్టేశారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పోస్టుల్లో కీలక పదవులపై ఆ పార్టీ నేతలు కన్నేశారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం సాధ్యపడలేదు. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్‌ పార్టీ సీట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని కాంగ్రెస్‌ నేతలు కీలకమైన పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

చిన్నాపెద్ద కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్‌ పదవులు తెలంగాణలో 100కు పైగా ఉంటాయని అంటున్నారు. వీటిలో కొన్ని కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులకు కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుంది. ఎమ్మెల్యే స్థాయి అధికారాలు కూడా కొన్ని నామినేటెడ్‌ పోస్టులకు ఉంటాయి. ఇలాంటివాటిని దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రితోపాటు పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తన బంధువులయినా, పరిచయస్తులైనా సరే ఊరికే పదవులు ఇవ్వడం ఉండదని.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసినవారికే న్యాయం చేస్తామని ఆయన ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు.

పదేళ్లు 2014–2024 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి, పార్టీని వీడకుండా వేరే పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉన్నవారికి నామినేటెడ్‌ పోస్టుల నియామకాల్లో పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో వివిధ కారణాలతో టికెట్లు ఇవ్వనివారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ చుట్టూ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుచరులకు కీలక పదవులు ఇప్పించుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. మరి రేవంత్‌ రెడ్డి నామినేటెడ్‌ పోస్టులను నియామకాలను ఎలా చేపడతారో వేచిచూడాల్సిందే.