తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అందుకేనా?
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని వారు తెలిపారు.
By: Tupaki Desk | 2 Jan 2024 9:36 AM GMTతెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అయితే ఈసారి సమ్మె చేస్తోంది కార్మికులు కాదు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు.
తమ సమస్యలు పరిష్కారించకపోతే జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని వారు తెలిపారు. రద్దీ పెరిగి బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఆర్టీసీ అద్దె యజమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రమాదాలు జరిగినప్పుడు బీమా రాకపోతే తమపై కేసులు పెడుతున్నారని వాపోయారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదని గుర్తు చేశారు. ఇందులో గిట్టుబాటు కావడం లేదు కాబట్టి టెండర్లు వేయొద్దని కోరుతున్నాం అని అద్దె బస్సుల యజమానులు తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. సీట్లు కోసం మహిళలు జట్టు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బస్సులు సరిపోవడం లేదని, బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారు కూడా పలుచోట్ల నిరసనలకు దిగారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు ఎవరూ ఎక్కడం లేదని.. దీంతో తమ ఆదాయం పడిపోయిందని వాపోతున్నారు. ఇలా అయితే తాము ఎలా జీవించాలని.. కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధప్రాతిపదికన బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వం 2500 బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వాటిని వెంటనే ప్రవేశపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 40 శాతం వరకు అద్దె బస్సులు తిప్పుతున్నారు.
ఇంకోవైపు ఆటో డ్రైవర్లు ఆందోళన చెందక్కర్లేదని.. వారి సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించడంతో ప్రభుత్వం వారికి ఎలాంటి హామీ ఇస్తుంది, పరిష్కారానికి ఏం చేస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులు కూడా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా తమ హయాంలో నియంతృత్వ పాలన సాగించబోమని, ప్రజా పాలన చేస్తామని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిరసనలు వ్యక్తం చేసుకోవడానికి ధర్నా చౌక్ ను కూడా పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఆమోదం లభిస్తుందని కార్మికులు భావిస్తున్నారు. 2019లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆర్టీసీలో సంఘాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.