బీజేపీలో ఇదే హాట్ సీటా ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుండి పోటీచేయాలని ప్రయత్నించినా టికెట్ దక్కలేదు.
By: Tupaki Desk | 2 Jan 2024 5:18 AM GMTరాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒక నియోజకవర్గంపై పార్టీలో బాగా కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సీటు ఏమిటంటే జహీరాబాద్ నియోజకవర్గమే. ఇక్కడ నుండి పోటీచేయాలని పార్టీలోని ఐదారుమంది నేతలు ఎవరికివారు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మొదటినుండి ఇక్కడ పోటీపైన దృష్టిపెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుండి పోటీచేయాలని ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. దాంతో చికోటి స్టార్ క్యాంపెయినర్ స్ధాయిలో చాలా నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.
నియోజకవర్గంలో బాగా మద్దతుదారులున్నారు, డబ్బుకు కొదవలేదు, రాష్ట్రమంతా చేసిన ప్రచారం, ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకోవటం లాంటి కారణాలను చూపించి ఎంపీ టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారట. అలాగే గోషామహల్ నుండి గెలిచిన రాజాసింగ్ కూడా జహీరాబాద్ ఎంపీ స్ధానంపై కన్నేశారు. పార్టీ అదేశిస్తే తాను పోటీకి రెడీగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రకటించటమే కాకుండా పోటీకి తగ్గ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారని సమాచారం. మరి ఎంఎల్ఏగా గెలిచిన రాజాసింగ్ వెంటనే ఎంపీగా ఎందుకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ?
ఇక టైగర్ నరేంద్రగా పాపులరైన ఆలె నరేంద్ర కొడుకు ఆలె భాస్కర్ కూడా పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తనకు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇంతకాలం పోటీచేసే అవకాశం తమకు రాని విషయాన్ని కూడా భాస్కర్ గుర్తుచేస్తున్నారు. పారిశ్రామికవేత్త ఏలేటి సురేష్ రెడ్డి కూడా పోటీకి రెడీ అవుతున్నారు. డబ్బు సమస్యలేదని టికెట్ ఇస్తే చాలని ఢిల్లీలోని పెద్దలతో చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏలేటికి కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశీస్సులున్నాయట.
అలాగే పార్టీ ప్రముఖ లాయర్, పార్టీ అధికార ప్రతినిధి రచనారెడ్డి కూడా జహీరాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈమె కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల తరపున కోర్టుల్లో కేసులు వేసి పాపులరయ్యారు. రైతుల తరపున తాను కోర్టుల్లో చేసిన పోరాటాల కారణంగా జనాల్లో తనకు మంచి ఆధరణ ఉందని రచనా పార్టీ పెద్దలతో ఇప్పటికే చెప్పారట. మొత్తానికి జహీరాబాద్ పార్లమెంటు సీటు బాగా హాట్ సీటైపోయినట్లే ఉంది. మరి టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.