గన్నవరంలో వంశీ హ్యాట్రిక్ కొడుతున్నారా ?
ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ పార్టీలోకి తెచ్చింది.
By: Tupaki Desk | 29 May 2024 3:00 AM GMTఉమ్మడి క్రిష్ణా జిల్లాలో గన్నవరం సీటు వెరీ హాట్ గురూ అని అంతా అంటున్న మాట. ఈ సీటు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ సైతం అతి తక్కువ సార్లు గెలిచింది ఇక్కడ. టీడీపీ పుట్టాక సైకిల్ జోరుని ఎవరూ ఆపలేని స్థితికి చేరుకుంది.
ఆ సీటులో వైసీపీ కూడా వరసగా రెండు సార్లు ఓడింది. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ పార్టీలోకి తెచ్చింది. ఆయనకు టికెట్ ఇచ్చింది. వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకటరావు టీడీపీలోకి వెళ్ళి పోటీ చేశారు.
ఈ ఇద్దరి మధ్యన భీకరమైన పోరు సాగింది. ఫలితాలకు అతి తక్కువ సమయమే ఉంది. పోలింగ్ సరళి చూస్తే రెండు పార్టీలలో చర్చ అయితే అంతర్గతంగా సాగుతోంది. పోటా పోటీగానే సాగింది అని అంటున్నారు. టఫ్ ఫైట్ గా సాగిన ఈ పోరులో విజేత ఎవరైనా తక్కువ మెజారిటీ రావడం ఖాయమని అంటున్నారు. వంశీ అయితే తన హ్యాట్రిక్ విజయం మీద నమ్మకం ఉంచారు. కానీ అది జగన్ సంక్షేమ పధకాలు పొందిన పేదలు మహిళలు, ఇతర వర్గాల లబ్దిదారులతోనే అని అంటున్నారుట.
తనకు సొంత సామాజిక వర్గం వెన్నుపోటు పొడిచింది అన్నది వంశీ సన్నిహితులతో అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. తాను పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా వారికి ఎంతో చేశాను అని ఆయన చెప్పుకున్నారు. అయినా సరే వారు ఎన్నికల వేళ తనకే టోకరా ఇచ్చారని వాపోయినట్లుగా చెబుతున్నారు.
ఇక గన్నవరంలో కమ్మల ఆధిపత్యం రాజకీయంగా బలంగా ఉంటుంది. వారు ఏ సైడ్ ఉంటే రిజల్ట్ అటే డిసైడ్ అవుతుంది అన్న మాట ఉంది. మరి వంశీ తన సన్నిహితులతో పంచుకున్న మాటలు నిజం అయితే ఎడ్జ్ టీడీపీకే ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది.
వంశీ చంద్రబాబు మీద ఆయన కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతోనే సొంత సామాజిక వర్గం దూరం అయింది అని అంటున్నారు. రాజకీయంగా కాకుండా సామాజిక వర్గం పరంగా ఇది పెద్ద చీలికను తెచ్చి వంశీని సొంత వారే ఒంటరిని చేశారు అని ప్రచారం సాగుతోంది.
అయితే వంశీ మాత్రం తన గెలుపు ధీమాను ఎక్కడా కోల్పోవడం లేదు అని అంటున్నారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలే తనను గెలిపిస్తాయని అంటున్నారు. ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం మహిళలు ఓటింగులో పాల్గొనడం కూడా వైసీపీ విజయానికి కలసి వచ్చిన పరిణామం అని వంశీ వర్గీయులు చెబుతున్నారు.
ఏది ఏమైనా చూస్తే ఫలితం మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది. దాంతో వంశీ గెలుస్తారా యార్లగడ్డ సైకిలెక్కి అసెంబ్లీ దాకా పరుగులు తీస్తారా అన్నది మాత్రం టెన్షన్ పెట్టే అంశమే అవుతుంది అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.