Begin typing your search above and press return to search.

హరియాణా ఎన్నికల్లో వినేశ్ పోటీ ఆ పార్టీ నుంచేనా?

ఈ సమయంలో... ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారంటూ తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   20 Aug 2024 11:30 PM GMT
హరియాణా ఎన్నికల్లో వినేశ్  పోటీ ఆ పార్టీ నుంచేనా?
X

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆమె కుస్తీ తనపై గెలిచిందంటూ.. ఆటకు వీడ్కోలు పలికారు. దీంతో.. ఆమె భవిష్యత్తు ప్రయాణం ఏమిటనే చర్చ సర్వత్రా నెలకొంది. ఈ సమయంలో... ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారంటూ తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశలున్నాయని.. పైగా తన సోదరి బబిత ఫోగాట్ పైనే ఆమెను నిలబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

తాజాగా ఈ విషయాలపై ఫొగాట్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుంచి కీలక విషయాలు వెల్లడైనట్లు మీడియా వెల్లడించింది. ఇందులో భాగంగా... ఆమె రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అని ప్రశ్నిస్తూనే... హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ పోటీ చేయొచ్చు.. ఇక, ఈ పోటీ కూడా వినేశ్ వర్సెస్ బబితా మధ్యా ఉండొచ్చు అని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే... ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే విషయం మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదని తెలుస్తోంది. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చా మొదలైంది. అందుకు గల కారణమూ ఉంది! ఇటీవల వినేశ్ ఫొగాట్ భారత్ కు చేరుకున్న సమయంలో.. విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెను సాదరంగా స్వాగతించారు.

ఇదే సమయంలో... వినేశ్ ను రాజ్యసభకు పంపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకుని, దాద్రి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా... హరియాణాలోని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేశ్ సోదరి బబిత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే... ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో దాద్రీ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. ఇండిపెండెంట్ అభ్యర్థిపై 14,272 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి కూడా బీజేపీ ఆమెకే టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇలా వస్తున్న కథనాలన్నీ నిజమైతే... ఈసరి హరియాణా ఎన్నికల్లో దాద్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫోగాట్ సిస్టర్స్ పోరు కచ్చితంగా హాట్ టాపిక్ గా మారే అవకాశలున్నాయి. ఇక అక్టోబర్ 1న హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.